ఫామ్​హౌస్ సీఎంను కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని: సీఎం రేవంత్ రెడ్డి

ఫామ్​హౌస్ సీఎంను కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని: సీఎం రేవంత్ రెడ్డి
  • రాష్ట్ర హక్కులను సాధించుకోవడానికి ఎన్నిసార్లయినా ఢిల్లీకి వెళ్తా 
  • హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చేందుకు భూమాఫియా ప్రయత్నం
  • ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు
  • సెప్టెంబర్ 17ను ఒకరు విలీనం, మరొకరు విమోచనం అంటున్నరు 
  • స్వార్థ ప్రయోజనాల కోసం అమరుల త్యాగాలను పలుచన చేసే ప్రయత్నం 
  • అందుకే ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’గా పేరు పెట్టామని వెల్లడి 
  • పబ్లిక్ గార్డెన్స్​లో జెండాను ఆవిష్కరించిన సీఎం

హైదరాబాద్, వెలుగు: కాలు కదపకుండా ఇంట్లోనే కూర్చోవడానికి తానేం ఫామ్​హౌస్‌‌ ముఖ్యమంత్రిని కాదు అని, పనిచేసే ముఖ్యమంత్రిని అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. కేంద్రం నుంచి మనకు హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని, ఆ హక్కులను సాధించుకోవడానికి ఎన్నిసార్లయినా ఢిల్లీకి వెళ్తానని చెప్పారు.

మంగళవారం సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్​లోని పబ్లిక్​ గార్డెన్స్​లో జాతీయ జెండాను సీఎం రేవంత్​రెడ్డి ఆవిష్కరించారు. అంతకుముందు గన్​పార్క్ లోని ​అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం రేవంత్ మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించుకోవడానికే ఢిల్లీకి వెళ్తున్నానని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రధాని, కేంద్రమంత్రులను స్వయంగా కలిసి వివిధ అంశాలపై వినతిపత్రాలు అందజేస్తున్నట్టు చెప్పారు.

 ‘‘నా ఢిల్లీ పర్యటనలపై విమర్శలు చేస్తున్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేదతీరడానికి నేనేం ఫామ్​హౌస్‌‌ ముఖ్యమంత్రిని కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని. నా స్వార్థం కోసమో, వ్యక్తిగత పనుల కోసమో ఢిల్లీకి వెళ్లడం లేదు. ఢిల్లీ  ఏ పాకిస్తాన్‌‌లోనో, బంగ్లాదేశ్‌‌లోనో లేదు. అది మన దేశ రాజధాని. ఇది ఫెడరల్‌‌ వ్యవస్థ. రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య అనేక అంశాలు ఉంటాయి. రాష్ట్రం నుంచి మనం పన్నుల రూపంలో కొన్ని వేల కోట్లు కడుతున్నాం. అందులో మన వాటా తిరిగి తెచ్చుకోవడం మన హక్కు. ఆ హక్కుల సాధన కోసం ఎన్నిసార్లయినా ఢిల్లీకి వెళ్తాను. ఇటీవల 16వ ఆర్థిక సంఘం ముందు కూడా గట్టిగా మన వాదనలు వినిపించాం. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌‌ చేశాం’’ అని వెల్లడించారు. 

‘‘గత పదేండ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేశారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారు. లోన్ల కిస్తీలు, వడ్డీ కిందనే ప్రతి నెలా రూ. 6 వేల కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టి.. ఆరు గ్యారంటీలను అమలు చేయడం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ఒక సవాల్​గా స్వీకరించాం. లోన్ల రీస్ట్రక్చర్ ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం” అని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తిగా ప్రజా పాలన దినోత్సవం నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఎవరైనా తప్పుపడితే, వారిది స్వార్థ ప్రయోజనమే అవుతుంది తప్ప.. ప్రజాహితం కాబోదన్నారు. ఇందులో తమ స్వార్థం లేదని.. కాంగ్రెస్​పార్టీ కోసమో, వ్యక్తిగత ఆకాంక్షతోనో తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు. ‘‘సెప్టెంబర్ 17 విలీనం అని ఒకరు, విమోచనం అని ఒకరు అంటున్నారు. 

స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేస్తున్నారు. అందుకే ఈ శుభ దినానికి ప్రజా కోణాన్ని జోడించి ‘ప్రజా పాలన దినోత్సవం’గా పేరు పెట్టాం” అని వెల్లడించారు. తెలంగాణ అంటే త్యాగమని, ఆ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల సంక్షేమమే గీటురాయిగా పాలన ఉంటుందని, ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు అని, వారి ఆకాంక్షలే తమ కార్యాచరణ అని తెలిపారు. 

‘‘తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికిలి మాదిరిగా ఉంటుంది. పిడికిలి పోరాటానికి గుర్తు. అంతేకాదు.. ఐదు వేళ్లు బిగిస్తేనే పిడికిలి. తెలంగాణలో అన్ని జాతులు, అన్ని కులాలు, మతాలు కలిసికట్టుగా ఉంటాయన్న సందేశం ఇందులో ఇమిడి ఉంది. ఈ ఐక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్17ను కొందరు వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయడం క్షమించరాని విషయం. నాలుగు కోట్ల పిడికిలి ఎప్పటికీ అలాగే ఉండాలి. పెత్తందార్లపై, నియంతలపై ఈ పిడికిలి ఎప్పటికీ పోరాట సంకేతంగా ఉండాలి. గత పదేండ్లు తెలంగాణ నియంత పాలనలో మగ్గిపోయింది. ఆ బానిస సంకెళ్లను తెంచడానికి సెప్టెంబర్17 స్ఫూర్తిగా నిలిచింది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణను నియంత పాలన నుంచి విముక్తి చేస్తానని ప్రజలకు మాట ఇచ్చాను. గజ్వేల్​గడ్డ మీద 2021 సెప్టెంబర్17 నాడు ‘దళిత - గిరిజన ఆత్మగౌరవ దండోరా’ మోగించినం” అని గుర్తు చేశారు. 

యువ వికాసానికి ద్విముఖ వ్యూహం..  
యువ వికాసం కోసం తమ ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘ఓవైపు గత పదేండ్లుగా రాష్ట్రానికి పట్టిన మత్తును వదిలిస్తున్నాం. యువత భవితకు పెను సవాలుగా మారిన మాదక ద్రవ్యాల నియంత్రణ, నిర్మూలన విషయంలో కఠినంగా ఉంటున్నాం. మరోవైపు క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. పారాలింపిక్స్, ఇతర అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన తెలంగాణ బిడ్డలను ఘనంగా గౌరవించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో యువతలో నైపుణ్యాలకు పదును పెట్టి.. ఉపాధి, ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వబోతున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్​యూనివర్సిటీ ఏర్పాటు తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక కీలక మలుపు కాబోతున్నది” అని చెప్పారు.  

రుణమాఫీ.. ఒక చరిత్ర 
ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్ కు మంచి ట్రాక్​రికార్డు ఉందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా సంక్షేమం విషయంలో రికార్డులు తిరగరాస్తున్నామని పేర్కొన్నారు. ‘‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఒకేసారి రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశాం. అక్కడక్కడా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఆ సమస్యలు పరిష్కరించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీ జరిగేలా చూస్తాం. 6 నెలల వ్యవధిలో దాదాపు రూ.18 వేల కోట్లు 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన చరిత్ర దేశంలో మరెక్కడైనా ఉందా? ఇదీ రైతుల విషయంలో మా కమిట్మెంట్” అని తెలిపారు. గల్ఫ్​కార్మికులు ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తున్నామని..  ప్రజాభవన్ లో ‘ప్రవాసీ ప్రజావాణి కేంద్రం’ ఏర్పాటు చేశామని చెప్పారు. 

హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ.. 
ప్రపంచ వేదికలపై రాష్ట్రాన్ని ‘ఫ్యూచర్​ స్టేట్’ గా బ్రాండ్​ చేస్తున్నామని, పెట్టుబడుల ఆకర్షణలో ఇదొక వ్యూహాత్మక ప్రయత్నమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘తెలంగాణ ఫ్యూచర్ స్టేట్​మాత్రమే కాదు.. క్లీన్​స్టేట్​గా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక, సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు.. పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేసినం. ఒకప్పుడు లేక్ సిటీగా పేరొందిన హైదరాబాద్.. ఇప్పుడు ఫ్లడ్​సిటీగా మారిపోయింది. ఈ పాపం గత పదేండ్లు పాలించినోళ్లదే. చెరువులు, నాలాలు కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు. నా స్వార్థం లేదు. అదొక పవిత్ర కార్యం. ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం. కొందరు భూమాఫియాగాళ్లు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్​ భవిష్యత్ కు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది. ఇది నా భరోసా” అని చెప్పారు. హైడ్రాకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మూసీ సుందరీకరణతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదని.. వేలాది మంది చిరు, మధ్య తరగతి వ్యాపారులకు ఒక ఎకనామిక్ హబ్ గా మారుతుందని పేర్కొన్నారు. 

హామీలన్నీ అమలు చేస్తున్నం.. 
తెలంగాణ సంస్కృతి, అస్తిత్వం అంటే వారి కుటుంబమేనని గత పాలకులు భావించారని సీఎం రేవంత్​రెడ్డి విమర్శించారు. తెలంగాణ జాతి వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉందని అనుకున్నారని పేర్కొన్నారు. ‘‘అధికారంలోకి రాగానే అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించాం. టీఎస్​ను టీజీగా మార్చాం. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠకు భూమి పూజ చేశాం. గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇస్తున్నాం. కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టాం” అని తెలిపారు. ‘‘ఫ్రీ బస్ స్కీమ్ తో ఆడబిడ్డలకు రూ.2,958 కోట్లు ఆదా అయ్యాయి. ఆరోగ్యశ్రీ పథకం లిమిట్ ను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. 

రేషన్​కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం కడుతున్నాం. 3 నెలల్లో 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. 11,062 పోస్టులతో డీఎస్సీ నిర్వహించాం. జాబ్‌‌ క్యాలెండర్‌‌ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తున్నాం. వచ్చే ఐదేండ్లలో 63 లక్షల మంది ఆడబిడ్డలకు రూ.లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్యాస్ సబ్సిడీతో 43 లక్షల కుటుంబాలకు మేలు చేస్తున్నాం. గృహజ్యోతి పథకం ద్వారా 49 లక్షల కుటుంబాలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఈ ఏడాది 4.50 లక్షల ఇండ్లు నిర్మించనున్నాం. భూమి లేనోళ్లకు భూమి కూడా ఇస్తాం. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేశాం. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని చెప్పారు.


సెప్టెంబర్ 17ను విలీనం అని ఒకరు, విమోచనం అని ఒకరు అంటున్నారు. స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేస్తున్నారు. అందుకే ఈ శుభ దినానికి ప్రజా కోణాన్ని జోడించి ‘ప్రజా పాలన దినోత్సవం’గా పేరు పెట్టాం.

- సీఎం రేవంత్​ రెడ్డి