బెంగళూరు - హైదరాబాద్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌ కారిడార్‌‌‌‌.!

బెంగళూరు - హైదరాబాద్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌ కారిడార్‌‌‌‌.!
  • ప్రకటించాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్​ విజ్ఞప్తి
  • ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌‌‌‌గా హైదరాబాద్​
  • రాష్ట్రంలో రూ. 30 వేల కోట్లు దాటిన ఏరోస్పేస్ ఎగుమతులు
  • డిసెంబర్ 8, 9 తేదీల్లో  ‘తెలంగాణ రైజింగ్’​ గ్లోబల్ సమిట్‌‌‌‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడి
  • శంషాబాద్‌‌‌‌లో ‘సఫ్రాన్’ ఎయిర్ క్రాఫ్ట్  ఫెసిలిటీ సెంటర్‌‌‌‌ ప్రారంభం
  • వర్చువల్​గా ఓపెన్​ చేసిన ప్రధాని మోదీ.. ప్రసంగించిన సీఎం
  • ఫెసిలిటీ సెంటర్​తో 1,300 కోట్ల పెట్టుబడులు.. 1,000 మందికి ఉపాధి

హైదరాబాద్, వెలుగు: దేశ రక్షణ, విమానయాన రంగాల బలోపేతానికి, ఆర్థిక ప్రగతికి దోహదపడేలా ‘బెంగళూరు – హైదరాబాద్‌‌‌‌’ ప్రాంతాన్ని డిఫెన్స్, ఏరోస్పేస్ కారిడార్‌‌‌‌గా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌‌‌‌ ఇప్పటికే దేశంలో ప్రధాన ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌‌‌‌గా మారిందని.. ఇక్కడి భౌగోళిక, సాంకేతిక అనుకూలతలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.  మంగళవారం శంషాబాద్‌‌‌‌‌‌‌‌లోని జీఎంఆర్ ఏరోస్పేస్ సెజ్‌‌‌‌‌‌‌‌లో ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌కు చెందిన ప్రముఖ సంస్థ ‘సఫ్రాన్’ ఏర్పాటు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా ఫెసిలిటీ సెంటర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌‌‌‌‌‌‌‌గా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.  తెలంగాణపై నమ్మకంతో సఫ్రాన్ సంస్థ తన ఫెసిలిటీ సెంటర్‌‌‌‌‌‌‌‌ను ఇక్కడ ఏర్పాటు చేయడం రాష్ట్రాభివృద్ధిలో ఒక మైలురాయిలాంటిదని సీఎం పేర్కొన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసులను అందించడంలో దేశంలోనే ఇది మొట్టమొదటి సెంటర్ కావడం గర్వకారణమన్నారు. ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌తో పాటు సఫ్రాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఎం88 మిలటరీ ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్ హాల్ (ఎంఆర్‌‌‌‌‌‌‌‌వో) యూనిట్‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన చేసుకోవడం శుభపరిణామమని సీఎం తెలిపారు. ఈ ఎంఆర్‌‌‌‌‌‌‌‌వో సెంటర్ భారత వైమానిక, నావికా దళాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సఫ్రాన్ గ్రూప్ దాదాపు రూ. 1,300 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా వెయ్యి మందికిపైగా నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు.

ఫార్మాను దాటిన ఏరోస్పేస్ ఎగుమతులు

రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగం అద్భుత ప్రగతిని సాధిస్తున్నదని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ రంగంలో ఎగుమతులు రెట్టింపయ్యాయన్నారు. గడిచిన 9 నెలల కాలంలోనే ఎగుమతులు రూ. 30 వేల కోట్లకు పైగా చేరుకున్నాయని, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఫార్మా రంగ ఎగుమతులను ఏరోస్పేస్ రంగం అధిగమించిందని పేర్కొన్నారు. బోయింగ్, ఎయిర్ బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి దిగ్గజ సంస్థల సరసన సఫ్రాన్ చేరడం ద్వారా హైదరాబాద్ ఖ్యాతి మరింత పెరిగిందన్నారు.

నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని సీఎం తెలిపారు. ఇందులో భాగంగానే ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని నెలకొల్పామని, అక్కడ విమానాల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 100 ఐటీఐలను అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ఎస్ఎంఈ విధానం దేశంలోనే అత్యుత్తమంగా నిలిచిందన్నారు. 

డిసెంబర్ 8, 9 తేదీల్లో గ్లోబల్ సమిట్​

ప్రపంచ అగ్రశ్రేణి నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలన్న సంకల్పంతో, విమానాశ్రయం సమీపంలో 30 వేల ఎకరాల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తున్నట్లు సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ప్రపంచానికి చాటిచెప్పేందుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌’ను నిర్వహిస్తున్నామని, దీనికి అందరూ ఆహ్వానితులేనని ఆయన పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదిగే క్రమంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, సఫ్రాన్ గ్రూప్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ రాస్‌‌‌‌‌‌‌‌ మెకలెన్స్, సీఈవో ఒలివర్‌‌‌‌‌‌‌‌ అండ్రీస్‌‌‌‌‌‌‌‌, ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ ఇంజిన్స్‌‌‌‌‌‌‌‌ సీఈవో స్టీఫేన్ క్యూయెల్, జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జీఎం రావు తదితరులు పాల్గొన్నారు.