ఎంబీబీఎస్​ నాలుగున్నరేండ్లు.. ఫీజులు ఐదేండ్లకు

ఎంబీబీఎస్​ నాలుగున్నరేండ్లు..  ఫీజులు ఐదేండ్లకు
  • ఎంబీబీఎస్​ నాలుగున్నరేండ్లు..  ఫీజులు ఐదేండ్లకు
  • ఒక్కో స్టూడెంట్​ నష్టపోతున్నది రూ.6-7లక్షలు
  • బ్యాంక్ గ్యారంటీ మస్ట్‌‌ అంటున్న మేనేజ్​మెంట్లు​
  • ఐదేండ్లకు ఫీజు కడ్తామని రాయించుకుంటున్న కాలేజీలు
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు


హైదరాబాద్, వెలుగు: తమ పిల్లల్ని మెడిసిన్ చదివించాలని ఆరాటపడుతున్న తల్లిదండ్రులకు ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. నీట్‌‌లో కష్టపడి సీటు తెచ్చుకున్నా, కాలేజీల్లో చేర్చుకోవడానికి యాజమాన్యాలు సవాలక్ష కండీషన్లు పెడ్తున్నయి. ఈ కండీషన్లన్నీ అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసుకునేలా ఉంటున్నయి. ఎంబీబీఎస్ కోర్సు నాలుగున్నరేండ్లలో కంప్లీట్​ అవుతది. కానీ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు 5ఏండ్లకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. స్టూడెంట్లను కాలేజీలో చేర్చుకోవడానికి ముందే ఐదేండ్లకు ఫీజు కడుతామని రాయించుకుంటున్నాయి. దీంతో ఒక్కో స్టూడెంట్ రూ.6 నుంచి 7లక్షలు నష్టపోతున్నారు. 
కోర్టు ఆదేశాలు బేఖాతరు
గతంలో మెడికోల పేరెంట్స్ ఈ విషయంలో కోర్టును కూడా ఆశ్రయించారు. 4.6 ఏండ్లకే ఫీజు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. కానీ, కోర్టు ఉత్తర్వుల అమలును కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సీరియస్‌‌గా తీసుకోవడం లేదని మెడికోలు ఆరోపిస్తున్నారు. 5 ఏండ్లకు లెక్కగట్టి వసూలు చేస్తున్నప్పటికీ, వర్సిటీ పట్టించుకోకపోవడాన్ని విద్యార్థి సంఘాలు సైతం తప్పుపడ్తున్నయి. ఈసారైనా కాలేజీల మీద ఒత్తిడి తెచ్చి, నాలుగున్నర ఏండ్లకే ఫీజు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఎంబీబీఎస్ బీ కేటగిరీ సీట్ల సాధన సమితి, హెల్త్ వర్సిటీకి విజ్ఞప్తి చేసింది. కానీ, తమ విజ్ఞప్తి హెల్త్ వర్సిటీ ఆఫీసర్ల నుంచి స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే సీటు!

కాలేజీల యాజమాన్యాలు అడుగుతున్న బ్యాంక్ గ్యారంటీ కూడా తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నది. కాలేజీలో చేరడానికి ముందే ఓ ఏడాది ఫీజు కట్టాలని, మరో ఏడాది ఫీజుకు సరిపడా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని కాలేజీలు పట్టుబడుతున్నయి. ఇందుకు కాళోజీ హెల్త్ వర్సిటీ కూడా అంగీకరిస్తుండడంతో, తమ కష్టం ఎవరికి చెప్పుకోవాలో తెల్వక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన ఎత్తేయాలని, బ్యాంక్ గ్యారంటీ అడగకుండా కాలేజీలను అడ్డుకోవాలని మెడికోలు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నప్పటికీ సర్కార్ పట్టించుకోవడం లేదు. ఇటీవలే ఎంబీబీఎస్ సీట్ల కౌన్సెలింగ్​కు సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి కూడా బ్యాంక్ గ్యారంటీ నిబంధనను కొనసాగించింది. దీంతో తమ పిల్లల్ని మెడిసిన్ చదివించాలని ఆశపడ్తున్న తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రెండేండ్లకు రూ.23 లక్షలు

మన రాష్ట్రంలో మేనేజ్‌‌మెంట్ కోటా ఎంబీబీఎస్ సీటు ఫీజు, కాలేజీని బట్టి ఏడాదికి రూ.11.55 లక్షల నుంచి రూ.14.5 లక్షల దాకా ఉంది. అంటే, రెండేండ్లకు తక్కువల తక్కువ రూ.23 లక్షలు అవుతుంది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తం కట్టలేక పిల్లల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి మేనేజ్‌‌మెంట్ కోటా 85శాతం సీట్లను తెలంగాణ స్టూడెంట్లకే కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈసారి ఎక్కువ మంది లోకల్ స్టూడెంట్లకు మేనేజ్‌‌మెంట్ కోటా సీట్లు వచ్చే చాన్స్​ ఉంది. అయితే, బ్యాంక్ గ్యారంటీ నిబంధనతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన స్టూడెంట్లు నష్టపోయే ప్రమాదం ఉంది.

ఐదేండ్ల ఫీజు అన్యాయం

ఎంబీబీఎస్‌‌ కోర్సు నాలుగున్నరేండ్లలో పూర్తవుతది. నేషనల్ మెడికల్ కమిషన్‌‌ కూడా అదేవిధంగా కోర్సు రూపొందించింది. అన్ని రాష్ట్రాల్లో నాలుగున్నరేండ్ల ఫీజులు తీసుకుంటే, మన రాష్ట్రంలోని కాలేజీలు మాత్రం ఐదేండ్లకు ఫీజులు వసూలు చేస్తున్నయి. అగ్రిమెంట్​ మీద సైన్​ చేస్తేనే అడ్మిట్ చేసుకుంటన్నయి. గతంలో కంప్లైంట్ చేసినా ఎవరూ పట్టించుకోలే. ఇప్పుడు మళ్లీ వర్సిటీకి, సర్కార్‌‌‌‌ పెద్దలకు వినతిపత్రాలిచ్చాం. ఇప్పటిదాకా ఎలాంటి రెస్పాన్స్​ లేదు. మంత్రి హరీశ్‌‌రావు స్పందించాలని కోరుతున్నాం.
- రవిప్రసాద్‌‌, ప్రెసిడెంట్, ఎంబీబీఎస్‌‌