మంత్రి దామోదర్, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గొడవపై హైకమాండ్ కు పీసీసీ చీఫ్ నివేదిక

మంత్రి దామోదర్, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గొడవపై హైకమాండ్ కు పీసీసీ చీఫ్ నివేదిక
  • జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌‌‌‌పైనా రిపోర్ట్​

హైదరాబాద్, వెలుగు: మంత్రి దామోదర్​ రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు వ్యవహారంపై మీరే నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ కు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విన్నవించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు నివేదిక పంపారు. ఇటీవల ‘సర్’కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సభ సందర్భంగా ఓ హోటల్ లో మంత్రి, ఎమ్మెల్యే గొడవపడ్డ విషయం తెలిసిందే. దీనిపై వాస్తవాలు తెలుసుకొని వివరణ తీసుకునేందుకు గాంధీ భవన్ కు రావాలని పీసీసీ చీఫ్ హోదాలో వారిని కోరానని, కానీ ఇద్దరూ రాలేదని రిపోర్ట్​లో పేర్కొన్నారు. 

కారణం తెలుసుకునేందుకు ఫోన్​చేసినా స్పందించలేదని, పీసీసీ అధ్యక్షుడి పదవికి సైతం వారు తగిన గౌరవం ఇవ్వలేదని మహేశ్​గౌడ్​అందులో చెప్పినట్లు తెలిసింది. ఇక, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇటీవలి కాలంలో తరచూ చేస్తున్న వ్యాఖ్యలు ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని హైకమాండ్​కు పీసీసీ చీఫ్​రిపోర్ట్​ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలు, పత్రికల క్లిపింగ్స్​ను జత చేసి పంపినట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆయన తరచూ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి వస్తాయని, పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు తెలిసింది.