చంద్రబాబు గెలిస్తే.. జగన్ పరిస్థితి ఏంటి?: జగ్గారెడ్డి

చంద్రబాబు గెలిస్తే.. జగన్ పరిస్థితి ఏంటి?: జగ్గారెడ్డి

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై వ్యక్తిగత దూషణల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి స్పందించారు. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం తనకు ఇబ్బందిగా అనిపించిందన్నారు. అసెంబ్లీలో చంద్రబాబుకు వైసీపీ, జగన్ టీమ్ చేసిన అవమానాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో దూషణలు చూడలేదన్నారు జగ్గారెడ్డి. చంద్రబాబును ఓ సారి వైఎస్ కూడా ఓ మాట అన్నారని గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత వాటిని రికార్డుల నుంచి తొలగించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో నైతిక విలువలు మరిచిపోయే వ్యక్తిగత దూషణలకు దిగడం సరైన సంప్రదాయం కాదన్నారు జగ్గారెడ్డి. 

పదవులు ఎవరికీ శాశ్వతం కాదన్నారు. రాజకీయాల్లో విలువలను పరిరక్షించాలన్నారు. సభలో వైసీపీ నేతల ప్రవర్తన సమాజానికి చెడు సంకేతాల్ని పంపిస్తోందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్నారు. తన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు జగ్గారెడ్డి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ... అప్పుడు జగన్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేని పాలన కొనసాగుతున్నట్లు అనిపిస్తోందన్నారు జగ్గారెడ్డి.