పోటాపోటీగా రచ్చబండ కార్యక్రమం

పోటాపోటీగా రచ్చబండ కార్యక్రమం

రాష్ట్రంలో రాహుల్ టూర్, వరంగల్ రైతు డిక్లరేషన్ తర్వాత కాంగ్రెస్ లీడర్లు, క్యాడర్ లో జోష్ కనిపిస్తోంది. రచ్చబండ కార్యక్రమంతో జనంలో ఉండేలా ప్లాన్ చేసింది పీసీసీ. అయితే మొదట కొంతమంది నేతలు అంటీముట్టనట్టుగా ఉంటున్నా ప్రస్తుతం మాత్రం పోటాపోటాగా రచ్చబండలో పాల్గొంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ముగ్గురు, నలుగురు నేతలు ఎవరికి వారుగా కార్యక్రమాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించే నేతలంతా రచ్చబండ పేరుతో ఇప్పుడు అనుచరులతో కలిసి జనంలో ఉంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో కూడా బెల్లయ్య నాయక్ ఒకవైపు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇదే సెగ్మెంట్ లో టికెట్ ఆశిస్తున్న కిరణ్ నాయక్ తన అనుచరులతో రచ్చబండలో పాల్గొంటుండడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక జనగామ జిల్లాలో మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఓ వైపు రచ్చబండ చేస్తుంటే... ఇదే సెగ్మెంట్ లో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూడా తన అనుచరులతో కలిసి రచ్చబండ నిర్వహిస్తున్నారు. దీనిపై పొన్నాల అనుచరులు కొమ్మూరిపై పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు.

పోటీలు పడుతూ.. రచ్చబండ  కార్యక్రమం :-
అటు జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జి ఇందిరకు పోటీగా దొమ్మాటి సాంబయ్య కూడా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి గీతారెడ్డికి పోటీగా జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో నరోత్తంరెడ్డి రచ్చబండ నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నరోత్తంరెడ్డి ఇక్కడి నుండి టికెట్ ఆశిస్తుండడంతో ఇంటర్నల్ గా ఇద్దరు నేతల వార్ నడుస్తోందని క్యాడర్ చెబుతోంది. మరోవైపు ఎల్లారెడ్డి నియోజవర్గంలోనూ ఇద్దరి నేతల మధ్య పోటాపోటీగా రచ్చబండ కార్యక్తమాలు సాగుతున్నాయి. మదన్ మోహన్ రావు, వర్సెస్ సుభాష్ రెడ్డి అనేలా తమ అనుచరులతో రచ్చబండ కార్యక్రమాలు చేస్తున్నారు. నిజామాబాద్ రూరల్ లో నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎమెల్సీ భూపతి రెడ్డి కి పోటీగా నగేష్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాలు చేపట్టడంతో క్యాడర్ పరేషాన్ లోపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏకంగా ముగ్గురు నేతలు పోటీ పడి మరీ రచ్చబండ కార్యక్రమాలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకే టికెట్ అంటూ చౌహన్ అటు చారులత రాథోడ్ అనుచరుల దగ్గర చెప్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరు సంగతి ఇలా ఉంటే మరో నేత బోజ్యా కూడా తన అనుచరులతో కలిసి రచ్చబండ నిర్వహిస్తున్నారు.

క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదులు :-
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సెగ్మెంట్లో దేప భాస్కర్ రెడ్డి వర్సెస్ డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నర్సింహా రెడ్డి పోటీ పడి మరి రచ్చబండ కార్యక్రమాలు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో కూడా ఇదే సీన్ నడుస్తోంది. మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డికి పోటీగా పటేల్ రమేష్ రెడ్డి రచ్చబండ కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ అని రచ్చబండ వేదికగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేతల తీరు చూసి అనుచరులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఏ నాయకుడు చేపట్టే రచ్చబండలో పాల్గొనాలో తెలియక ఆగం అవుతున్నారు. కొందరి నేతల అనుచరులు పీసీసీ క్రమశిక్షణ సంఘానికి కంప్లైంట్లు చేస్తున్నారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మెన్ గా ఉన్న మాజీ మంత్రి చిన్నారెడ్డి కూడా ఈ రచ్చబండ తిప్పలు తప్పడం లేదు. వనపర్తి సెగ్మెంట్ నుండి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనారెడ్డి రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీనియర్ నేత, వివాదాలకు దూరంగా ఉండే చిన్నారెడ్డికి పోటీగా శివసేనా కార్యక్రమాలు నిర్వహించడం హాట్ ఇష్యూ అయ్యింది.