- 30 నుంచి 35 మంది కొత్తవాళ్లకు చాన్స్: మహేశ్ గౌడ్
- ప్రతిదానికి గాంధీ భవన్‌కు రావద్దని కేడర్‌కు విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. 50కిపైగా కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు పలు డైరెక్టర్ పదవులనూ భర్తీ చేస్తామని తెలిపారు. బుధవారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. నామినేటెడ్ పోస్టులలో 30 నుంచి 35 మంది కొత్త వారికి అవకాశం ఉంటుందని చెప్పారు. పదవీకాలం ముగిసిన అందరికి తిరిగి రెన్యూవల్ చేస్తే కొత్త వారికి అవకాశం రాదని.. అయితే, పార్టీ కోసం పనిచేసిన కొందరికి మాత్రం రెన్యూవల్ చేసే అంశంపై చర్చిస్తామన్నారు. ఈ పదవుల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని చెప్పారు. ఎంపీ రేణుకా చౌదరి మాటలను వక్రీకరించారని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ, బీఆర్ఎస్.. కాంగ్రెస్ వైపు చూస్తున్నాయని మాత్రమే ఆమె అన్నారన్నారు. సీపీఐ తమకు మిత్రపక్షమే అని, ఆ పార్టీతో తమ మైత్రీ కొనసాగుతుందని చెప్పారు.
ఆ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అంటే మాకు గౌరవమేనని, ఆయనపై ఖమ్మం ఎంపీ రఘురామి రెడ్డి ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. అయినా, ఆయన సీపీఐ ఎమ్మెల్యే, ఆయనపై మాకు ఎందుకు ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో స్థానికంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని అక్కడే పరిష్కరించుకోవాలని, ప్రతి చిన్న విషయానికి గాంధీ భవన్ కు రావొద్దని పార్టీ క్యాడర్ కు ఆయన సూచించారు. నలుగురైదుగురు డీసీసీ అధ్యక్షులు మినహా మిగతా వారంతా బాగానే పనిచేస్తున్నారని చెప్పారు. పార్టీ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్‌తో రెండు రోజుల పాటు డీసీసీ అధ్యక్షుల సమావేశాలు జరుగుతాయని తెలిపారు. పార్టీ మండల కమిటీ అధ్యక్షుల నియామకంలో డీసీసీ చీఫ్ ల నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు.
