- విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ కొట్టిన తెలంగాణ క్రికెటర్
- విజయ్ హజారే ట్రోఫీ లో డబుల్ సెంచరీ సాధించిన 9వ బ్యాటర్ అమన్.
- 4 వికెట్లతో మెరిసిన సిరాజ్
ఇండియా డొమెస్టిక్ క్రికెట్‌లో మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ బిడ్డ పేరాల అమన్ రావు (154 బాల్స్‌లో 200 నాటౌట్) విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీతో సంచలనం సృష్టించాడు.
హైదరాబాద్, వెలుగు: ఇండియా డొమెస్టిక్ క్రికెట్‌లో మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ కుర్రాడు పేరాల అమన్ రావు (154 బాల్స్‌లో 12 ఫోర్లు, 13 సిక్సర్లతో 200 నాటౌట్) విజయ్ హజారే ట్రోఫీలో అజేయ డబుల్ సెంచరీతో సంచలనం సృష్టించాడు. ఇటీవలే ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ఎంపికైన 21 ఏండ్ల అమన్.. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో తన టాలెంట్‌ను దేశానికి చూపెట్టాడు.
కెరీర్‌లో మూడో లిస్ట్-–ఎ మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ కొట్టి ఔరా అనిపించాడు. మహ్మద్ షమీ వంటి టాప్ బౌలర్లతో కూడిన బెంగాల్ బౌలింగ్‌ను ఉతికేస్తూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన అతను హైదరాబాద్ తరఫున లిస్ట్–ఎ క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
ఫలితంగా రాజ్‌కోట్ వేదికగా మంగళవారం జరిగిన గ్రూప్–బి మ్యాచ్‌లో హైదరాబాద్ 107 రన్స్ తేడాతో బెంగాల్‌ను చిత్తుగా ఓడించింది. అమన్ మెరుపులతో తొలుత హైదరాబాద్ 50 ఓవర్లలో 352/5 భారీ స్కోరు చేసింది. రాహుల్ సింగ్ (65) కూడా రాణించాడు.
షమీ (3/70) మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్‌లో బెంగాల్ 44.4 ఓవర్లలో 245 రన్స్‌కే ఆలౌటైంది. షాబాజ్ అహ్మద్ (108), అనుస్తుప్ (59) పోరాడారు. మహ్మద్ సిరాజ్ (4/58) నాలుగు వికెట్లతో దెబ్బకొట్టాడు. అమన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 6 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఐదో ప్లేస్‌లో ఉన్న హైదరాబాద్ నాకౌట్ బెర్తు ఇప్పటికే చేజార్చుకుంది. గురువారం చివరి మ్యాచ్‌లో జమ్మూ కాశ్మీర్‌తో తలపడనుంది.
షమీ, ఆకాశ్‌ను దంచేసి.. సిక్స్‌తో డబుల్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో అమన్ డబుల్ సెంచరీ ఒకెత్తయితే. మహ్మద్ షమీ, అకాశ్ దీప్, ముకేశ్ కుమార్, షాబాజ్ అహ్మద్ వంటి మేటి బౌలర్లను ఎదుర్కొంటూ ఏమాత్రం తడబడకుండా షాట్లు కొట్టడం మరో ఎత్తు. కెరీర్‌లో మూడో లిస్ట్–ఎ మ్యాచ్ మాత్రమే ఆడుతున్నప్పటికీ 21 ఏండ్ల అమన్ ఎంతో పరిణతితో బ్యాటింగ్ చేశాడు. తొలుత ఆచితూచి ఆడిన అతను ఇన్నింగ్స్ సాగుతున్న కొద్దీ గేర్ మార్చాడు.
రాహుల్ సింగ్‌తో తొలి వికెట్‌కు 104 రన్స్, కెప్టెన్ తిలక్ వర్మ (34)తో రెండో వికెట్‌కు 87 రన్స్ జోడించాడు. 65 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాత వేగం పెంచాడు. 107 బాల్స్‌లో సెంచరీ చేసిన తర్వాత మరింత స్పీడు అందుకున్నాడు. మరో 27 బాల్స్‌లోనే 150 మార్కు చేరిన హైదరాబాద్ ప్లేయర్ చివరి 50 రన్స్ కేవలం 20 బాల్స్‌లోనే పూర్తి చేశాడంటే అతని విధ్వంసం ఎలా ఉందో చెప్పొచ్చు.
ముకేశ్ బౌలింగ్‌లో 6, 6, 4... షమీ వేసిన 47వ ఓవర్లో 4, 6, 6తో రెచ్చిపోయాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో అమన్ డబుల్ సెంచరీ చేరుకోవడానికి 14 రన్స్ అవసరమవడంతో ఉత్కంఠ రేగింది. ఆకాశ్ దీప్ వేసిన ఆ ఓవర్లో నాలుగో బాల్‌కు ఫోర్ కొట్టి.. ఐదో బాల్‌కు డబుల్ తీసిన అమన్.. లాస్ట్ బాల్‌ను లాంగాన్ మీదుగా సిక్స్‌గా మలచి డబుల్ సెంచరీ అందుకోవడం లెజెండరీ ప్లేయర్ సెహ్వాగ్ స్టయిల్‌ను గుర్తు చేసింది.
దమ్మున్నోడు..
విజయ్ హజారే ట్రోఫీలో అజేయ డబుల్ సెంచరీ కొట్టిన అమన్ రావు పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. హెచ్‌సీఏ తరఫున ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో చాన్నాళ్ల నుంచి నిలకడగా రాణిస్తున్న ఈ కుర్రాడిది కరీంనగర్ జిల్లా. అతని కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. తండ్రి మధుకర్ రావు జిల్లా స్థాయి క్రికెటర్ కావడంతో చిన్నప్పటి నుంచే అమన్ ఆటపై ఇష్టం పెంచుకున్నాడు. ఫ్యామిలీ సపోర్ట్ కూడా తోడవడంతో ఏడేండ్ల నుంచి ఆటపైనే ఫోకస్ పెట్టిన అమన్ ఒక్కో మెట్టూ ఎక్కుతూ ముందుకొస్తున్నాడు.
రోహిత్ శర్మ, కేన్ విలియమ్సన్‌ను ఇష్టపడే అమన్ ఆట ఆ ఇద్దరినీ పోలి ఉంటుంది. పరిస్థితులు, జట్టు అవసరాలకు తగ్గట్టుగా.. ఒక్కో పరుగుతో ఇన్నింగ్స్ నిర్మించే ఓర్పుతో పాటు పేస్, స్పిన్ బౌలింగ్‌లో భారీ షాట్స్ కొట్టే టాలెంట్ అతని సొంతం. ఈ ప్రతిభతోనే హెచ్‌సీఏ లీగ్స్‌లో సత్తా చాటిన అతను ఆ తర్వాత స్టేట్ టీమ్ తరఫున బీసీసీఐ విజయ్ మార్చంట్, వినూ మన్కడ్, కూచ్ బెహార్ టోర్నీల్లోనూ ఆకట్టుకున్నాడు. ఇటీవల ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే నిర్భయంగా భారీ షాట్లు కొడుతూ 24 రన్స్ పిండుకుని తన దూకుడును ప్రపంచానికి పరిచయం చేశాడు.
ఆ ట్రోఫీలో 160 ప్లస్ స్ట్రయిక్ రేట్‌తో 234 రన్స్ తో రాణించాడు. అమన్ క్లీన్ హిట్టింగ్ టాలెంట్, బౌలర్ ఎవరన్నది చూడకుండా దాడి చేసే అతని నైజాన్ని గుర్తించిన రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్ వేలంలో రూ.30 లక్షలకు దక్కించుకుంది. హిట్టింగ్ మాత్రమే కాదు ఒత్తిడిని తట్టుకోవడం, భారీ ఇన్నింగ్స్ ఆడటం అమన్ బలం. ఈ డబుల్ సెంచరీతో తాను కేవలం ఒక టీ20 ప్లేయర్ మాత్రమే కాదు, సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే దమ్మున్న బ్యాటర్ అని నిరూపించుకున్నాడు. అమన్ ఇలానే దూసుకెళ్తే ఏదో రోజు టీమిండియా నుంచి పిలుపు అందుకుంటాడు.
