అంతర్జాతీయ స్థాయిలో మన వంటలు.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ‘కలినరీ యాక్సిలరేటర్’

అంతర్జాతీయ స్థాయిలో మన వంటలు.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ‘కలినరీ యాక్సిలరేటర్’

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పండే ప్రతి పంటకు, ప్రతి సంప్రదాయ ఆహారానికి ప్రపంచ వేదిక కల్పించేందుకు ప్రభుత్వం చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్​ వేదికగా ‘తెలంగాణ కలినరీ ఎక్స్‌‌‌‌పీరియెన్షియల్ టూరిజం యాక్సిలరేటర్(టీసీఈటీఏ) వంటలో నైపుణ్యం, సృజనాత్మకత’ను ప్రారంభించనున్నది. రాబోయే ఐదేండ్లలో రూ.8 వేల కోట్ల భారీ ఆహార ఆర్థిక వ్యవస్థను నిర్మించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నది. రైతులు, చెఫ్‌‌‌‌లు, స్టార్టప్‌‌‌‌లు, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ‘టీసీఈటీఏ’ ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 

హైదరాబాద్​లోని వీ- హబ్​లో బుధవారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ‘టీసీఈటీఏ’ కార్యక్రమం నిర్వహించనున్నారు.  వైఏటీ అండ్ సీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, స్పీడ్ సీఈవో జయేశ్​రంజన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. ఆహార ఆవిష్కరణలు, పర్యాటకం, పారిశ్రామికతను మేళవించి రాష్ట్రాన్ని అంతర్జాతీయ ఆహార కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికను వివరించనున్నారు. అంతేకాదు, ‘ప్రపంచానికి తెలంగాణ ఆహార గుర్తింపు’ అనే అంశంపై ఈ వేదికపై చర్చించనున్నారు. తెలంగాణ వంటకాల రుచి పరీక్షలు కూడా ఏర్పాటు చేశారు.

ఇండో- డచ్ సహకారంతో..

ఇండో–- డచ్ సహకారంతో తెలంగాణ రుచులను ప్రపంచ వేదికకు  పరిచయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నెదర్లాండ్స్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ (ఎన్‌‌‌‌ఐసీసీటీ).. ‘తెలంగాణ కలినరీ ఎక్స్‌‌‌‌పీరియెన్షియల్ టూరిజం యాక్సిలరేటర్’ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నది. ఈ సందర్భంగా ఎన్‌‌‌‌ఐసీసీటీ అధ్యక్షురాలు డాక్టర్ ఎడిత్ నార్డ్‌‌‌‌మాన్ మాట్లాడుతూ.. ఆహార పర్యాటకం అనేది వ్యవసాయం, ఇన్నోవేషన్, కల్చర్​ను ఏకం చేసే ఆర్థిక యంత్రాంగమని పేర్కొన్నారు. తెలంగాణ విజన్,​ నెదర్లాండ్స్ స్థిరమైన అగ్రి-టెక్, ఫుడ్​టెక్నాలజీ కలిస్తే రెండు దేశాల్లోని స్టేక్​హోల్డర్లకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఫుడ్​ స్టార్టప్​లకు ప్రోత్సాహకంగా 

ఫుడ్-టెక్, డ్రింక్స్ రంగాల్లో స్టార్టప్‌‌‌‌లను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణను అంతర్జాతీయ ఆహార కేంద్రంగా తీర్చిదిద్దడం. రైతుల ఆదాయాన్ని పెంచే స్థిరమైన వ్యాపార నమూనాలను సృష్టించడం దీని ఉద్దేశం. ఈ కలినరీ యాక్సిలరేటర్ చొరవతో రైతులు, స్థానిక చెఫ్‌‌‌‌లు, ఫుడ్‌‌‌‌-టెక్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌లు, దేశ విదేశీ పెట్టుబడిదారులను ఏకీకృతం చేసి వంటల ఆధారంగా సుస్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించే సమగ్ర వేదికగా టీసీఈటీఏ రూపుదిద్దుకోనుంది. అంతేకాదు, రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, ఇన్నొవేషన్ రంగాలన్నీ ఏకీకృతం కానున్నాయి. ఆతిథ్య రంగానికి వేదికగా తెలంగాణ నిలవనున్నది.