నిరుద్యోగులకు ‘డీట్’ భరోసా.. ప్రైవేట్ కొలువులకు ఇక డిజిటల్ వారధి : ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి

నిరుద్యోగులకు ‘డీట్’ భరోసా.. ప్రైవేట్ కొలువులకు ఇక డిజిటల్ వారధి : ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి
  •     పీఎం ఇంటర్న్‌‌షిప్ కింద నెలకు రూ.9 వేల స్టైఫండ్ 
  •     టీజీసీహెచ్ ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి వెల్లడి   

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందేందుకు డిజిటల్ ఎంప్లాయ్‌‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) ఒక ప్రధాన వేదిక అని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ డీజిటల్ ప్లాట్‌‌ఫామ్ నిరుద్యోగులకు, కంపెనీలకు మధ్య కీలక వారధిగా పని చేస్తుందని ఆయన తెలిపారు.  బుధవారం హైదరాబాద్‌‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో డీట్ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు.  

చదువురాని వారి నుంచి పీహెచ్‌‌డీ పట్టభద్రుల వరకు ఈ పోర్టల్‌‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే ఈ ప్లాట్‌‌ఫామ్‌‌పై ఇండస్ట్రియల్, సర్వీస్, ట్రేడింగ్, ఐటీ వంటి వివిధ రంగాలకు చెందిన 2 వేలకు పైగా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయన్నారు. ప్రస్తుతం ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, ఇంటర్న్‌‌షిప్, అప్రెంటిస్‌‌షిప్, వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతుల్లో సుమారు 4 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అభ్యర్థులు  www.deet.telangana.gov.in ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చని సూచించారు. యూనివర్సిటీలు, డిగ్రీ, పీజీ కాలేజీల అధికారిక  వెబ్‌‌సైట్లలో డీట్  లింక్‌‌ను పొందుపరచాలని కోరారు. 

పీఎం ఇంటర్న్‌‌షిప్.. నెలకు రూ.9 వేలు..

ప్రధానమంత్రి ఇంటర్న్‌‌షిప్ స్కీమ్ (పీఎంఐఎస్) మూడవ రౌండ్ పైలట్ త్వరలో ప్రారంభమవుతుందని, 18- నుంచి 25 ఏళ్లలోపు విద్యార్థులు పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా లేదా డిగ్రీ/పీజీ చదువుతున్న వారు, పూర్తి చేసిన వారు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి 6 నుంచి 12 నెలల పాటు ఇంటర్న్‌‌షిప్ ఉంటుందని, వీరికి నెలకు రూ.9వేల స్టైఫండ్‌‌తో పాటు అదనంగా ఒకసారి రూ.6వేల  గ్రాంట్ లభిస్తుందని తెలిపారు. 

అయితే కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదని, వార్షిక ఆదాయం రూ.12 లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు pminternship.mca.gov.in పోర్టల్‌‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీసీహెచ్ఈ సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, డీట్ డైరెక్టర్ జే రాజేశ్వర్ రెడ్డి, డీట్ అధికారులు డాక్టర్ ఎం. చంద్రశేఖర్, జి. శ్రీహరిణి తదితరులు పాల్గొన్నారు.