- థర్మల్ సెంటర్లలో 17 రోజులకు పరిపడా బొగ్గు నిల్వలుండాలె
- సమాజానికి వెలుగులు ఇచ్చేశాఖలో పనిచేస్తున్నాం
- అందరూ నిబద్ధతో మనసుపెట్టి పనిచేయాలి
- విద్యుత్ శాఖ సీఈలతో సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్: రాష్ట్రంలోని కృష్ణ, గోదావరి బేస్డ్ ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరుందని, వర్షపాతాలను దృష్టిలో పెట్టుకొని హైడల్ పవర్ ప్రొడక్షన్ పెంచాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో థర్మల్, హైడల్ విద్యుత్తు ఉత్పాదనపై సీఈలతో సమీక్ష నిర్వహించారు. థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి ప్లాంట్ లో కనీసం 17 రోజుల విద్యుత్ ఉత్పాదనకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మనమంతా నిబద్ధతతో, మనసుపెట్టి పనిచేయాలి నిర్లక్ష్యానికి, అలసత్వానికి, ఆలస్యానికి తావు లేదని తెలిపారు. విద్యుత్ శాఖ అంటే సమాజానికి వెలుగులు ఇచ్చే శాఖలో పనిచేస్తున్నామనే దృష్టి ఉండాలన్నారు.
ఎవరికైనా సమస్యలు ఉంటే వినేందుకు, వాటిని పరిష్కరించేందుకు 24 గంటల పాటు తాను అందుబాటులో ఉంటానని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి అధికారులు, సిబ్బందికి భరోసా ఇచ్చారు. విద్యుత్ ఉత్పాదనలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి అన్నారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ప్రాజెక్టులకు సంబంధించి సీఈలు నిర్లక్ష్యం వహించినట్లుగా ఉంటే రాతపూర్వకంగా వారి నుంచి వివరణ తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సల్తానియా, ట్రాన్స్ కో జేఎండీ శ్రీనివాస్, ఇంధన శాఖ ఓఎస్డీ సురేందర్ రెడ్డి, జెన్కో డైరెక్టర్లు, సీఈలు పాల్గొన్నారు.
