- డీజీపీ సీవీ ఆనంద్ ఆందోళన
- పీఓహెచ్ 12 శాతానికి పెరిగింది: సీఎస్‌బీ
హైదరాబాద్, వెలుగు: సమాజంలో సైబర్ నేరాలు అతిపెద్ద సవాల్‌గా మారాయని డీజీపీ సీవీ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటి నియంత్రణ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అధునాతన టెక్నాలజీని వినియోగిస్తూ అధికారులు ముందుకు సాగాలని సూచించారు. గురువారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్న టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ) కార్యాలయంలోని డిజిటల్ ల్యాబ్‌లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎస్‌బీ డైరెక్టర్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సిబ్బందిని అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపడుతున్న కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఇటీవల ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్లు, ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌లు, డిజిటల్ ఫైనాన్షియల్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయని, వీటిని అరికట్టకపోతే భవిష్యత్‌లో మరింత తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి పోలీస్ అధికారి సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి పట్టు సాధించి, సైబర్ నేరాలను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
ఆర్థిక నష్టాల్లో 20 శాతం తగ్గుదల: సీఎస్‌బీ
2025లో తెలంగాణలో సైబర్ నేరాల వల్ల రూ.1,524 కోట్ల ఆర్థిక నష్టం నమోదైనప్పటికీ, 2024తో పోలిస్తే ఇది 20 శాతం తగ్గుదలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ) తెలిపింది. ఈ క్రమంలోనే సైబర్ ఫిర్యాదులు 91,369 కు పరిమితమవడంతో, ఫిర్యాదుల సంఖ్యలోనూ 3 శాతం తగ్గుదల నమోదైనట్లు పేర్కొంది. మరోవైపు నేరస్తుల ఖాతాల్లోని నిధులను నిలిపివేసే పీఓహెచ్ (పుట్ ఆన్ హోల్డ్) మొత్తం రూ. 255 కోట్ల నుంచి రూ. 279 కోట్లకు పెరిగిందని, అలాగే పీఓహెచ్ శాతం 9 శాతం నుంచి 12 శాతానికి చేరిందని వివరించింది. సమీక్షా సమావేశంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్, ఎస్పీలు హర్షవర్ధన్, సాయి శ్రీ, డీఎస్పీలు, సీఐలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
