- తొలి విడతలో 2,720 గ్రామాలు.. 285 ఊళ్లలో ముగిసిన సర్వే, అభ్యంతరాల స్వీకరణ
- పెద్దగా రాని సమస్యలు.. పానాది, సరిహద్దుల్లో ఒకట్రెండు గుంటల తేడాలే ఎక్కువ
- ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మార్పులు చేసి మిగతా చోట్ల రీ సర్వేకు ప్లాన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రతిష్టాత్మక సమగ్ర డిజిటల్ భూ రీ-సర్వే క్షేత్రస్థాయిలో ఎలా సాగుతోందన్న దానిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర వివరాలు సేకరిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాల్లో భూ సమస్యలను పరిష్కరించి స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం దశలవారీ కార్యాచరణను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తొలి విడత కింద హైదరాబాద్ జిల్లా మినహా మిగిలిన 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున, అలాగే అసలు నక్షాలే అందుబాటులో లేని గ్రామాలను కలుపుకొని మొత్తం 2,720 గ్రామాల్లో ఈ సర్వే పనులను ప్రారంభించారు. వీటిలో ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసుకుని, ప్రస్తుతం రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ దశకు చేరుకున్న గ్రామాలు 285 ఉన్నాయి. ఈ 285 గ్రామాల్లో పనులు ఎలా జరిగాయి? క్షేత్రస్థాయిలో ఎలాంటి అంశాలు తెరపైకి వచ్చాయి? అనే వివరాలను ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. తొలి దశ గ్రామాల్లో వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు, చేర్పులు చేసి.. మిగతా గ్రామాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది.
పానాది, సరిహద్దుల్లో స్వల్ప తేడాలు
సర్వే పూర్తయిన గ్రామాల నుంచి వచ్చిన ప్రాథమిక నివేదికల ప్రకారం క్షేత్రస్థాయిలో ఎక్కడా పెద్దగా తీవ్రమైన సమస్యలు, వివాదాలు తలెత్తలేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా వ్యవసాయ పొలాల మధ్య ఉండే పానాది (బాట/దారి), సరిహద్దుల వద్ద మాత్రమే ఒక గుంట, రెండు లేదా మూడు గుంటల మేర విస్తీర్ణంలో స్వల్ప వ్యత్యాసాలు వచ్చినట్లు తేలింది. పూర్వం నుంచి రైతులు సాగు చేసుకుంటున్న క్రమంలో దారులు మారడం, గట్ల వద్ద కొద్దిమేర మార్పులు జరగడం వల్ల ఆధునిక కార్స్ నెట్వర్క్, రోవర్లతో డిజిటల్ కొలతలు వేసినప్పుడు ఈ స్వల్ప తేడాలు వెలుగుచూశాయి. చాలాచోట్ల పక్కపక్క రైతులు పరస్పర అవగాహనతోనే వీటిని పరిష్కరించుకోగా, మిగిలిన రైతులు తమ భూమి విస్తీర్ణంపై అభ్యంతరాల స్వీకరణ సమయంలో దరఖాస్తులు చేసుకున్నారు. రికార్డులకు, క్షేత్రస్థాయి స్థానానికి మధ్య వచ్చిన ఈ చిన్నపాటి మార్పులను నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ స్వల్ప తేడాలు మినహా అత్యధిక విస్తీర్ణంలో డిజిటల్ సర్వే కొలతలు సాఫీగానే సాగాయని అధికారులు పేర్కొంటున్నారు.
ఫీడ్‌బ్యాక్‌తో మార్గదర్శకాల్లో మార్పులు..
తొలి విడతలోని 2,720 గ్రామాల్లో పటాలు (నక్షాలు) అందుబాటులో లేని గ్రామాలను ప్రత్యేకంగా చేర్చడం వల్ల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించాల్సి వచ్చింది. శాటిలైట్ డేటా, డ్రోన్ సర్వేల సమన్వయంతో ఈ ప్రాంతాల్లో ప్రాథమిక సరిహద్దులను విజయవంతంగా గుర్తించారు. సర్వే పూర్తయిన 285 గ్రామాల్లో అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ ముగిసిన వెంటనే తుది పహాణీలు, సరిహద్దు నక్షాలను అధికారికంగా ఖరారు చేయనున్నారు. ఈ పైలట్ దశలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రామాణిక నిబంధనావళిని (ఎస్వోపీ) మరింత పటిష్టం చేస్తున్నారు. పానాది, సరిహద్దుల వద్ద వచ్చే చిన్నపాటి వ్యత్యాసాలను సులభంగా పరిష్కరించేందుకు వీలుగా క్షేత్రస్థాయి సర్వేయర్లకు మరిన్ని స్పష్టమైన మార్గదర్శకాలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
గ్రామసభలను విస్తృతంగా నిర్వహించి రైతులకు సర్వేపై పూర్తి అవగాహన కల్పించడం వల్లే అపోహలు తొలిగి సర్వే ప్రక్రియ ముందుకు సాగుతోందని అధికారులు వెల్లడించారు. తొలి విడతలో భాగంగా మిగిలిన గ్రామాల్లోనూ సర్వేను వేగవంతం చేస్తూనే, రాష్ట్రంలోని మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాల్లో దశలవారీగా ఈ ప్రక్రియను ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అభ్యంతరాల దశలో ఉన్న 285 గ్రామాల్లో వచ్చిన అనుభవాలను ఇతర ప్రాంతాల్లో విస్తరణకు పాఠాలుగా ఉపయోగించుకోనున్నారు. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న వాస్తవ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ, రైతుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర భూ సర్వేను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
వివాదాస్పద భూములు తాత్కాలికంగా పక్కన..
అదే సమయంలో రైతుల మధ్య తీవ్ర వివాదాలు ఉండి, పరస్పరం అంగీకారం కుదరని సమస్యాత్మక భూముల విషయంలో అధికారులు అత్యంత సంయమనంతో వ్యవహరించారు. రైతులు సర్వేకు ఒప్పుకోని సందర్భాల్లో లేదా గొడవలు జరిగే అవకాశం ఉన్న చోట వారిపై ఎలాంటి బలవంతం చేయకుండా, ఆ నిర్దేశిత వివాదాస్పద భూమి వరకు కొలతలు వేయకుండా తాత్కాలికంగా పక్కన పెట్టారు. మిగిలిన వివాదరహిత భూములన్నింటినీ యథావిధిగా సర్వే చేసి డిజిటల్ రికార్డుల్లో నమోదు చేశారు. ఇలా పక్కన పెట్టిన వివాదాస్పద భూములను తదుపరి విడతలో ఇరువర్గాల సమక్షంలో చర్చల ద్వారా గానీ, రెవెన్యూ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో గానీ విచారించి పరిష్కరించాలని నిర్ణయించారు. దీంతో గ్రామంలోని మొత్తం సర్వే ప్రక్రియ స్తంభించిపోకుండా ఉండటంతో పాటు, అన్నదాతల్లో ఎలాంటి అభద్రతాభావం కలగకుండా ముందుకెళ్లడం సాధ్యమైందని క్షేత్రస్థాయి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
