ఏపీ ఉద్యోగులు తెలంగాణకు వస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు

ఏపీ ఉద్యోగులు తెలంగాణకు వస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు

హైదరాబాద్, వెలుగు: ఏపీ ఉద్యోగులు తెలంగాణకు వచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వ రంగ ఉద్యోగుల సమాఖ్య డిమాండ్ చేసింది. ఏపీ ఉద్యోగులు వస్తున్నారనే వార్తలు తెలంగాణ ఎంప్లాయీస్​ను ఆందోళనకు గురి చేస్తున్నట్లు సమాఖ్య జనరల్ సెక్రటరీ జి.టి. జీవన్ తెలిపారు. ఏపీ, తెలంగాణ మధ్య ఉద్యోగుల బదిలీకి అనుమతిస్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఏపీ నుంచి తెలంగాణకు 887 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఈ మేరకు జాబితాను తెలంగాణ ప్రభుత్వ ఆమోదం కోసం అధికారులు పంపించారని పేర్కొన్నారు.

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఆమోదంతో బదిలీల విధివిధానాల ప్రక్రియకు రూపకల్పన జరగనున్న నేపథ్యంలో దీనిని తెలంగాణ ప్రభుత్వ రంగ ఉద్యోగుల సమాఖ్య పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. ఎంతోకాలంగా తెలంగాణ ఉద్యోగులు ప్రమోషన్ల కోసం, ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఇప్పుడు ఆంధ్రా ఉద్యోగులు బదిలీల పేరుతో వచ్చి తమపై క్యాడర్ లో కొనసాగే పద్ధతిని ఒప్పుకునే ప్రసక్తేలేదన్నారు. ఈ నెల 27న ఢిల్లీలో కేంద్ర హోం శాఖ నిర్వహించనున్న సమావేశంలో ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల పంపకాలను పూర్తి చేయాలన్నారు.