వడ్ల కొనుగోళ్లు మరింత స్పీడప్ చేయండి : మంత్రి ఉత్తమ్

వడ్ల కొనుగోళ్లు  మరింత స్పీడప్ చేయండి : మంత్రి ఉత్తమ్
  • నిరుడు ఈ టైమ్ కంటే డబుల్ సేకరణ: మంత్రి ఉత్తమ్
  • కొనుగోళ్లపై తప్పుడు ప్రచారం జరుగుతున్నదని వెల్లడి
  • తుఫాన్​తో 1.10 లక్షల ఎకరాల్లో పంట నష్టం: మంత్రి తుమ్మల
  • ధాన్యం సేకరణపై అధికారులతో మంత్రుల సమీక్ష

హైదరాబాద్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లను మరింత స్పీడప్ చేసి, సేకరించిన వడ్లను వెంటవెంటనే రైస్ మిల్లులకు తరలించాలని రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సెక్రటేరియెట్​లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, సివిల్ సప్లైస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వర్షాలకు తడిసిన వడ్లను తక్షణమే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించి, బాయిల్డ్ రైస్ కోటా కేటాయింపుల కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. తగిన గోదాంలు, హమాలీ సిబ్బందిని సమకూర్చి అంతరాయం లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై తప్పుడు ప్రచారం జరుగుతున్నదని, కలెక్టర్లు తరచుగా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని సూచించారు. 

“ఇది రైతుల ప్రభుత్వమని, తప్పుడు ప్రచారాలు తమ పారదర్శకతను దెబ్బతీయలేవన్నారు. వానాకాలం సీజన్​లో 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించి ఇప్పటి వరకు 3.95 లక్షల టన్నుల సన్నాలు, 4.59 లక్షల టన్నుల దొడ్డు రకాలు కలిపి మొత్తం రూ.2,041.44 కోట్లు విలువైన 8.54 లక్షల టన్నుల ధాన్యం 1.21లక్షల మంది రైతుల నుంచి సేకరించాం.  ఇందులో రూ.832.90 కోట్లు ఇప్పటికే చెల్లించగా, మిగిలిన రూ.1,208.54 కోట్లు ఓపీఎంఎస్ ద్వారా 48 గంటల్లో చెల్లిస్తం” అని వివరించారు. గత సంవత్సరం ఇదే టైంకు 55,493 మంది రైతుల నుంచి 3.94 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగా, ఈ ఏడాది రెట్టింపు కొనుగోళ్లు చేసినట్టు తెలిపారు.

పత్తి సేకరణ లిమిట్ ​పెంచాలని కేంద్రానికి వినతి: తుమ్మల

మొంథా తుఫాన్ వల్ల 1.10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక పంపినట్లు తుమ్మల నాగేశ్వర్​రావు వెల్లడించారు. వానాకాలంలో సాగైన మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ కొనుగోళ్లపై చర్చించారు. పత్తి సేకరణ పరిమితిని ఎకరాకు 7 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్లకు పెంచేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. వర్షాలతో రంగు మారిన సోయాబీన్ కొనుగోలుకు అనుమతి కోసం కూడా ప్రతిపాదన పంపినట్టు తెలిపారు. అలాగే ధాన్యం తేమ శాతం నిబంధనలు కోరినట్టు చెప్పారు. సమీక్ష సమావేశంలో సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.