కరువుపై కార్యాచరణ..తాగు, సాగునీరు, కరెంటుపై ఫోకస్

కరువుపై కార్యాచరణ..తాగు, సాగునీరు, కరెంటుపై ఫోకస్
  • యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్న సర్కారు
  • 12న మంత్రులతో సీఎం సమావేశం
  • 235 మండలాల్లో కరువు పరిస్థితులు
  • వచ్చే 8 నెలల్లో ఏం చేద్దామనేదే చర్చ 
  • రాబోయే 8 నెలలు అత్యంత కీలకం

హైదరాబాద్, వెలుగు: ఎల్ నినో కారణంగా నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. రాబోయే 8 నెలలు అత్యంత కీలకం కావడంతో ఈ నెల 12న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో భూగర్భజలాలు పడిపోతుండగా, రిజర్వాయర్లలో నీటినిల్వలు తగ్గుతున్నాయి. కరెంట్​డిమాండ్​ అంతకంతకూ పెరుగుతుండగా మున్ముందు తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం కనిపిస్తున్నది. ఈ అంశాలన్నింటిపైనా సీఎం సమీక్షించనున్నారు. సామాన్య ప్రజలు మొదలుకొని పరిశ్రమల వరకు అవసరమైన విద్యుత్, నీటి కొరత తలెత్తకుండా ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ అజెండాను ఖరారు చేయనున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ప్రాథమికంగా చర్చించిన అంశాలపై మరింత లోతుగా సమీక్ష జరిపి ప్రజలకు  భరోసా కల్పించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ మేరకు వ్యవసాయ, నీటిపారుదల, ఇంధన శాఖల ఉన్నతాధికారులు పూర్తి స్థాయి సమాచారం, నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది.

సాగు, తాగునీటికి ఇబ్బందులు

ఎల్​నినో వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. సుమారు 235 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వానలు ముఖం చాటేయడంతో ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నాయి. ఖరీఫ్ సీజన్ ముగింపు దశలో ఉండగా కోతకు వచ్చిన పంటలు దెబ్బతింటున్నాయి. ఇక యాసంగి సాగు  ప్రశ్నార్థకంగా మారింది. బోర్లు ఎండిపోయి, కాల్వల్లో నీరు పారక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పల్లెలు, పట్టణాల్లో తాగునీటి సరఫరా రోజురోజుకు కష్టంగా మారుతోంది. ఎండల తీవ్రత సైతం పెరగడంతో విద్యుత్ డిమాండ్ సుమారు 20వేల మోగావాట్ల రికార్డు స్థాయికి చేరుకొని గ్రిడ్‌‌పై భారం పెరిగింది. దీంతో ఓ వైపు తాగునీరు, మరో వైపు గృహ, పారిశ్రామిక రంగాలకు కోతలు లేని విద్యుత్​సరఫరా చేయడం సర్కారుకు సవాలుగా మారింది.

మంత్రుల సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చ

ఎల్ నినో పరిస్థితులను అధిగమించేందుకు ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం రూపొందించిన కార్యాచరణ నివేదికపై సమావేశంలో చర్చించనున్నారు. కరవుతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలను ఖరారు చేస్తారు.  ప్రజాక్షేత్రంలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వివిధ రంగాల నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నారు. వర్షాభావ ప్రాంతాల్లో వలసలు నివారించేందుకు ఉపాధి హామీ పనిదినాలను పెంచడం, మూగజీవాలకు పశుగ్రాసం కొరత రాకుండా సైలేజ్ సరఫరా చేయడం వంటి క్షేత్రస్థాయి సహాయక చర్యలు చేపట్టే అవకాశముంది. పాలనా యంత్రాంగం క్షేత్రస్థాయికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించేలా విధివిధానాలు ఖరారు చేసి, విపత్తు నిర్వహణ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

నిధుల కేటాయింపుపై నిర్ణయం !

రాష్ట్రంలోని 235 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రైతులను ఆదుకునేందుకు, దెబ్బతిన్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు తక్షణమే రూ. 20 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని మంజూరు చేయాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ఢిల్లీ నుంచి సాయం అందేదాకా వేచి చూడకుండా, రాష్ట్ర ఖజానా నుంచే యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన అత్యవసర పనులకు నిధుల కేటాయింపులపై 12వ తేదీన జరిగే భేటీలో సీఎం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఎండల తీవ్రత దృష్ట్యా రాబోయే ఎనిమిది నెలల కాలాన్ని అత్యంత సంక్లిష్టమైనదిగా గుర్తిస్తూ  కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. నీరు, కరెంట్ పంపిణీలో ఏమాత్రం అలసత్వం జరిగినా సహించేది లేదని స్పష్టం చేస్తూ, ప్రతి నీటి బొట్టును పొదుపు చేసేలా ప్రభుత్వం విధివిధానాలు నిర్దేశించే అవకాశముంది.