అకడమిక్ క్యాలెండర్ ప్రింటింగ్ కాపీలు పంపిణీ

అకడమిక్ క్యాలెండర్ ప్రింటింగ్ కాపీలు పంపిణీ

హైదరాబాద్, వెలుగు: ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ల ప్రింటింగ్ కాపీలను అన్ని సర్కారు స్కూళ్లకు పంపించాలని నిర్ణయం తీసుకుంది. దీనికిగాను క్యాలెండర్ ను ప్రత్యేకంగా ప్రింట్ చేయించారు. స్కూళ్ల వారీగా వీటిని పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, ఎమ్మార్సీలకు ఒకటి చొప్పున అందించనున్నట్టు తెలిపారు. 

డీఈవో కార్యాలయం, కలెక్టరేట్లకు రెండు చొప్పున కాపీలను అందించనున్నారు. రాష్ట్రంలో 24,267 స్కూళ్లు ఉండగా ఎమ్మార్సీలు, డీఈవో కార్యాలయాలు కలిపి 662 ఉన్నాయి. మొత్తంగా 24,929 ప్రింటింగ్ కాపీలను పంపిణీ చేయనున్నారు. అకడమిక్ క్యాలెండర్ లో సెలవులు, పరీక్షలు, మహానీయుల జయంతులు, వర్ధంతి వివరాలు, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, వివిధ ముఖ్యమైన డేట్లు ఇతర వివరాలను దానిలో పొందుపరిచారు.