
త్వరలోనే ప్రజాప్రతినిధులకు లేఖలు: సబితా ఇంద్రారెడ్డి
ఎడ్యుకేషన్‌లో క్వాలిటీ పెంచుతం
మిషన్ భగీరథ ద్వారా సర్కారీ విద్యా సంస్థలకు నీళ్లిస్తమని వెల్లడి
రాష్ట్రవ్యాప్తంగా సర్కారు స్కూళ్లలో సమస్యల పరిష్కారం కోసం ‘బడుల దత్తత’ కార్యక్రమం చేపట్టనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ విషయమై త్వరలోనే సర్పంచుల నుంచి మంత్రుల దాకా ప్రజాప్రతినిధులు అందరికీ లేఖలు రాయనున్నట్టు చెప్పారు. విద్యార్థులకు మరింత క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్టీ ప్రాంగణంలో విద్యా శాఖ పరిధిలోని వివిధ విభాగాల అధికారులతో సమావేశం జరిగింది. విద్యాశాఖ కార్యదర్శి జనార్దనరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్ ఎడ్యుకేషన్ పై మంత్రి సమీక్షించారు. వివిధ విభాగాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మాట్లాడారు. ప్రతిపేద విద్యార్థికి ఉన్నత విద్య అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారని, ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు. తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. సర్కారీ విద్యాసంస్థల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్‌తో పాటు క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నామన్నారు.
సమస్యలు తీర్చుతున్నం
బడుల్లో విద్యార్థుల అటెండెన్స్ పెంచేందుకు చర్యలు మొదలుపెట్టామని సబిత చెప్పారు. చాలా స్కూళ్లలో టాయిలెట్స్ ఉన్నా నీళ్లు లేక నిరూపయోగంగా మారుతున్నాయని, ఈ సమస్య పరిష్కారం కోసం మిషన్ భగీరథ నీళ్లను స్కూళ్లకు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తద్వారా తాగునీటి సమస్య కూడా తీరుతుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన ‘30 రోజుల ప్రణాళిక’లో విద్యాసంస్థల అంశం కూడా ఉందన్నారు. బడులన్నింటినీ స్వచ్ఛ విద్యాలయాలుగా మార్చేందుకు, ఈ నెలంతా స్కూళ్లలో కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. స్కూల్‌తో పాటు ఇండ్లనూ నీట్‌గా ఉంచేలా పిల్లల్లో చైతన్యం పెంచుతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్స్ తగ్గించేందుకు కృషి చేస్తామని చెప్పారు. టెక్నికల్, హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులు అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ తర్వాత ఆయా డిపార్ట్‌మెంట్లను సమీక్షిస్తామన్నారు. సమావేశంలో పాఠశాల విద్య కమిషనర్ విజయ్ కుమార్, ఇంటర్‌బోర్డు సెక్రెటరీ అశోక్‌కుమార్, ఉన్నత విద్యామండలి సెక్రెటరీ శ్రీనివాస్‌రావు, ఎస్‌ఎస్‌ఏ అడిషనల్ డైరెక్టర్ శ్రీహరి, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ శేషుకుమారి, వివిధ విభాగాల డైరెక్టర్లు సత్యనారాయణరెడ్డి, సుధాకర్, వెంకటేశ్వర శర్మ, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘ఈ-న్యూస్ వెబ్ మ్యాగజైన్’ ప్రారంభం
విద్యా రంగంలోని సక్సెస్ స్టోరీస్ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ‘ఈ–న్యూస్ వెబ్ మ్యాగజైన్’ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని స్టూడెంట్స్, టీచర్ల విజయ గాథలను అందులో పొందుపరుస్తామని తెలిపారు. వెబ్ మ్యాగజైన్ను ప్రారంభించడానికి కృషి చేసిన అధికారులను అభినందించారు.