- విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఇతర రాష్ట్రాల తరహాలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక విస్మరించిందని తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ చక్రధరరావు, జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ హరగోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 8.2 శాతం మాత్రమే నిధులు కేటాయించడంపై విస్మయం వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ హయాంలో దెబ్బతిన్న విద్యావ్యవస్థను బాగు చేయాలంటే కనీసం 20 శాతం నిధులు ఇవ్వాలని కోరితే.. ప్రభుత్వం మొండిచేయి చూపిందని విమర్శించారు. సర్కారు బడుల్లో వసతులు, టీచర్లు లేకున్నా.. 2,500 స్కూళ్లకు ప్రీప్రైమరీ విద్యను విస్తరిస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా ఈ విస్తరణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి విద్యారంగానికి నిధులను 15 శాతానికి పెంచాలని కోరారు.
