మున్సిపాలిటీల్లో ముసాయిదా..117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా రిలీజ్

మున్సిపాలిటీల్లో ముసాయిదా..117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా రిలీజ్
  •  
  • ఈ నెల 4 వరకు అభ్యంతరాల స్వీకరణ.. 10న తుది జాబితా
  • మున్సిపాలిటీల్లో 2,690, కార్పొరేషన్లలో 366 వార్డులు 
  • 45 లక్షల మందికి పైగా ఓటర్లు
  • 23 లక్షల మంది మహిళలు, 
  • 22 లక్షల మంది పురుషులు, 
  • 500 మంది థర్డ్​ జెండర్లు  
  • 100 మున్సిపాలిటీల్లోనే 
  • అధికారికంగా జాబితాలు విడుదల
  • మిగతా చోట్ల అధికారుల తర్జనభర్జన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటర్ల జాబితాను మున్సిపల్​ కమిషనర్లు రిలీజ్​ చేశారు. పాలకవర్గాల గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు గాను చాలాచోట్ల జాబితాలను అధికారికంగా విడుదల చేశారు. వాళ్లంతా టీఈ పోల్‌‌లో రిపోర్ట్​అప్‌‌లోడ్ ​చేశారు. అయితే ఇంకొన్ని చోట్ల ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయలేదు. రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో కలిపి 45 లక్షల మందికి పైగా ఓటర్లు నమోదైనట్టు ఎన్నికల సంఘం ఆఫీసర్లు ప్రకటించారు. వీరిలో 23 లక్షల మంది మహిళలు, 22 లక్షల మంది పురుషులు, 500 మంది థర్డ్​జెండర్లు​ ఉన్నారని పేర్కొన్నారు. ఓటర్ల ముసాయిదా జాబితాపై ఈ నెల 4 వరకు అభ్యంతరాలు స్వీకరించి, 10న తుది జాబితా విడుదల చేయనున్నారు. 

 మొత్తం 3,056 వార్డులు.. ​

117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో కలిపి 3,056 వార్డులను ఫైనల్ ​చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. మున్సిపాలిటీల్లో 2,690, కార్పొరేషన్లలో 
366 వార్డులు ఉన్నట్టు తెలిపారు. ఇందులో అత్యధికంగా కరీంనగర్​కార్పొరేషన్‌‌లో 66 వార్డులు ఉండగా, మిగతా 5 కార్పొరేషన్లలో 60 చొప్పున వార్డులు ఉన్నట్టు చెప్పారు. మున్సిపాలిటీల వారీగా పరిశీలిస్తే వనపర్తి జిల్లా అమరచింత, ఆత్మకూర్, నల్గొండ జిల్లా చండూర్, మహబూబ్​నగర్​జిల్లా భూత్పూర్, గద్వాల జిల్లా అలంపూర్‌‌‌‌లో అత్యల్పంగా 10 వార్డుల చొప్పున ఉన్నాయని పేర్కొన్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో అత్యధికంగా 50 వార్డులు.. ఆదిలాబాద్, కామారెడ్డిలో 49 చొప్పున, నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేటలో 48 చొప్పున ఉన్నాయని వెల్లడించారు. 59 మున్సిపాలిటీల్లో 12 నుంచి 20 వార్డులు ఉండగా.. 47 మున్సిపాలిటీల్లో 21 నుంచి 47 మధ్య వార్డులు ఉన్నట్టు పేర్కొన్నారు. 

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. 

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను మున్సిపల్​శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. కమిషనర్​అండ్​డైరెక్టర్ ఆఫ్​మున్సిపల్​అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) కార్యాలయంలో ఈ శాఖ తరఫున ఎన్నికల విభాగం కార్యకలాపాలను నిర్వహించే అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జాయింట్​ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు చాలామంది ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం వ్యవహారాలపై స్పష్టత ఇచ్చేవారే కరువయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలోని అన్ని వార్డులు, పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితా ముసాయిదాను గురువారం అధికారికంగా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. 

మున్సిపల్ కమిషనర్లు ఈ ఓటర్ల జాబితాల ముసాయిదాను వార్డు కార్యాలయంతో పాటు మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల్లోనూ నోటీసు బోర్డుపై అంటించాలని ఆదేశాలు ఇచ్చారు. ఓటర్లు, ప్రజలందరికీ తెలిసే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌‌సైట్​టీఈ పోల్‌‌లో పొందుపరచాలని సూచించారు. కానీ గురువారం రాత్రి 10 గంటల వరకు కేవలం 100 మున్సిపాలిటీల్లో మాత్రమే కమిషనర్లు అధికారికంగా ఓటర్ల ముసాయిదా జాబితాను రిలీజ్​చేశారు. మిగతా చోట్ల క్లారిటీ ఇవ్వలేదు. టీఈ పోల్‌‌లో అధికారిక సమాచారం లేకపోవడంతో ఎన్నికల సంఘం ఆఫీసర్లు కూడా రాష్ట్ర స్థాయిలో నమోదైన ఓటర్ల సంఖ్య అధికారికంగా ప్రకటించలేకపోయారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై పెత్తనం చెలాయించే సీడీఎంఏ ఆఫీసర్లు.. ఈ ఎన్నికల వ్యవహారంతో తమకేమీ సంబంధం లేనట్టుగా వ్యవహరించారు. కనీసం తమ శాఖ పరిధిలోని మున్సిపల్, కార్పొరేషన్ల​కమిషనర్లతో మాట్లాడి అధికారికంగా సమాచారం ప్రకటించడంలో విఫలమయ్యారు. మొన్న పంచాయతీరాజ్ శాఖ 12 వేలకు పైగా గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించింది. నిత్యం ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం వెల్లడించడంలో ఆ శాఖ ఆఫీసర్లు ముందున్నారు. కానీ  కేవలం 123 అర్బన్​బాడీల ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారికంగా తెలియజేయడంలో మున్సిపల్​శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.