తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది.అన్ని రాజకీయ పార్టీల నేతలతో ఇవాళ ఎస్ఈసీ సమావేశం అయ్యింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ,ఓటర్ డ్రాఫ్ట్ ,పోలింగ్ స్టేషన్ల వివరాలపై చర్చిస్తోంది. ఇప్పటికే కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో ఎన్నికల సంఘం సమావేశమైంది.
ఫిబ్రవరిలో మున్సిపల్ఎన్నికలకు సర్కారు రెడీ కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. పార్టీ సింబల్స్‌పై జరిగే ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలన్నీ చాలెంజ్‌గా తీసుకుంటున్నాయి. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి నేతలు బస్తీబాట పట్టారు. పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం సర్పంచ్స్థానాలను గెలిచిన కాంగ్రెస్.. అదే ఊపుతో మున్సిపాలిటీలపైనా మూడు రంగుల జెండా ఎగరేయాలని ఉత్సాహంతో ఉన్నది.
ఈ సారి మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ తోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికలు జరిగే117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల పరిధిలో బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది.రాష్ట్రవ్యాప్తంగా 124 మున్సిపాలిటీలు 9 గ్రేటర్ కార్పొరేషన్లు ఉండగా వీటిలో గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్ఎంసీ) పాలకవర్గం గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూర్, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీల పాలవర్గాల గడువు వచ్చే ఏడాది మే వరకు ఉన్నది. ఇవి కాక మందమర్రి, మణుగూరు మున్సిపాలిటీలు షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నవి.
Also Read : అలర్ట్.. HT పత్తి విత్తనాలు అమ్మొద్దు..కొనొద్దు
ఈ పది చోట్ల మినహా ఇంకా మిగిలిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు ఈ ఏడాది జనవరిలోనే ముగిసింది. ప్రస్తుతం ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నది. ఇప్పటికే 117 మున్సిపాలిటీల పరిధిలో 2,630, ఆరు కార్పొరేషన్ల పరిధిలో 366 వార్డులను ఎలక్షన్ కమిషన్ ఫైనల్ చేసింది. అన్ని చోట్ల కలిపి 52.71 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లుగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి, అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు.
