ప్రచారానికి దేన్నీ వదుల్తలె టూత్ బ్రష్​ల పంపిణీ.. టెంపుల్ టూర్లు

ప్రచారానికి  దేన్నీ వదుల్తలె టూత్ బ్రష్​ల పంపిణీ.. టెంపుల్ టూర్లు
  • చావుల కాడ పోటీపడి ఓదార్పులు  
  • చాటింపులు వేయించి ఊర్లకు పోతున్రు
  • ఎవరు ఏమడిగినా పంచుతున్రు 
  • ప్రచారంలో నేతల కొత్త ఎత్తుగడలు  

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారంలో అభ్యర్థులు కొత్త కొత్త ఎత్తుగడలకు తెరలేపుతున్నారు. కొందరు తమ పేర్లతో ఇంటింటికీ టూత్ బ్రష్ లు పంచుతుంటే.. మరికొందరు నేతలు జనాలను టెంపుల్ టూర్లకు తీసుకుపోతున్నారు. గ్రామాల్లో ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు సైతం నేతలు పోటీపడుతున్నారు. ఎలాగైనా సరే నియోజకవర్గంలో పట్టు సాధించి, ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చాలా మంది నేతలు కొత్త కొత్త ట్రెండ్ లకు నాంది పలుకుతున్నారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ తమ పేరు చేరేలా కొందరు నేతలు టూత్ బ్రష్​ల ట్రెండ్​కు శ్రీకారం చుట్టారు. పొద్దున్నే లేవగానే పండ్లు తోముకునేటప్పుడు తమను జనం గుర్తు చేసుకునేలా ఇంటింటికీ టూత్ బ్రష్ లు పంపిణీ చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రతి ఇంటికీ అభ్యర్థి పార్టీ గుర్తుతో పాటు, పార్టీ కలర్‌‌‌‌తో, అభ్యర్థి పేరును ముద్రించిన టూత్‌‌‌‌ బ్రష్‌‌‌‌లను పంచుతున్నారు. ఈ ప్లాన్‌‌‌‌ను నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో ఓ అభ్యర్థి ఇంప్లిమెంట్‌‌‌‌ చేస్తున్నాడు.  

టెంపుల్‌‌‌‌ టూర్‌‌‌‌లు 

ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ఇప్పటి నుంచే నానా పాట్లు పడుతున్నరు. ఓటర్ల మనుసుల్లో స్థానం సంపాదించడానికి సెంటిమెంట్‌‌‌‌ను ప్రయోగిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు యాదాద్రి టెంపుల్‌‌‌‌ ను  సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తున్నారు. గ్రామాల్లో బస్సులు ఏర్పాటు చేయించి ఓటున్న ప్రతి ఒక్కరిని యాదాద్రి దర్శనానికి తీసుకువెళుతున్నారు. ఇన్నాళ్లు ప్రజలకు దూరంగా ఉన్న కొందరు అభ్యర్థులు ఇప్పటికే రంగంలోకి దిగారు. రోజూ గ్రామాల్లో ప్రజలను కలుస్తూ నియోజకవర్గంలోనే గడుపుతున్నారు. అలాగే ఏ అకేషన్‌‌‌‌ వచ్చినా వదులుకోకుండా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నరు. చాలా మంది నేతలు బోనాలు, పంద్రాగస్టు నుంచే ప్రచారం షురూ చేసిన్రు. ఫ్లెక్సీలు, గోడలకు వాల్‌‌‌‌ రైటింగ్‌‌‌‌లు, చింపేసే వీలు లేకుండా గోడలపై సరికొత్త వినైల్‌‌‌‌ పోస్టర్లను అంటిస్తున్నరు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గోడలపై పార్టీ గుర్తులు అభ్యర్థుల ఫోటోలతో కొత్త పోస్టర్లు వెలుస్తున్నాయి. 

డప్పు చాటింపులు  

కొందరు నేతలు ముందే చాటింపులు వేయించి, ఆయా గ్రామాలకు వెళ్తున్నారు. పలానా పార్టీ అభ్యర్థి రేపు పలానా గుడికి వస్తున్నారు. బోనాలు చేస్తే రూ.300, బతుకమ్మలతో వచ్చే వారికి రూ.200, ఊరేగింపుల్లో డ్యాన్స్‌‌‌‌లు చేస్తే  బీరు సీసా.. అంటూ చాటింపులు వేయిస్తున్నారు. ఇప్పుడు ఈ చాటింపు వీడియో ఒకటి సోషల్‌‌‌‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలాగే పేద విద్యార్థులకు నోటుబుక్స్, గ్రామాల్లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పండుగలకు సామాగ్రి సహాయం, చనిపోయిన కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయడంలో నేతలు ఇప్పటి నుంచే పోటీ పడుతున్నరు. యువతకు క్రికెట్‌‌‌‌ కిట్లు, క్రీడల సామగ్రి, యువజన సంఘాలు, కుల సంఘాల భవనాలకు నిధులు సమకూర్చి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుల దేవతల గుడులకు నిధులు సమకూర్చి కూడా ఆకట్టుకోవాలని చూస్తున్నారు.