
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జనగామ, మధిర, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్, ఆలేరు, భువనగిరి, బహదూర్ పుర సెగ్మెంట్లలో ఎన్నికలు రద్దు చేయాలని బీఎస్పీ కోరింది. నామినేషన్ల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. చిన్నచిన్న విషయాల వల్ల తమ నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్‌వో) రిజెక్ట్ చేశారని ఆ పార్టీ వైస్ ప్రెసిడెంట్ దయానంద్ రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసి ఆర్‌వోల తీరుపై ఫిర్యాదు చేశారు.
నామినేషన్ల పరిశీలనలో తప్పులను సరిచేయడానికి అవకాశం ఉన్నా ఆర్‌వోలు రిజెక్ట్ చేస్తున్నారని తెలిపారు. అలంపూర్‌లో నామినేషన్ రిజెక్ట్ చేసి మళ్లీ స్వీకరించారని చెప్పారు. నామినేషన్ల రిజెక్ట్‌పై తాము కోర్టుకు వెళ్తామని తెలిపారు. ఆర్‌వోలు అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో మంగళవారం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్‌వో కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాగా, సిర్పూర్‌లో ఎస్పీ తన సొంత వాహనం ఉపయోగించి మద్యాన్ని పంపిణీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.