బడంగ్​పేటలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏమైంది?: అందెల శ్రీరాములు

బడంగ్​పేటలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏమైంది?: అందెల శ్రీరాములు

ఎల్​బీనగర్,వెలుగు: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవెరలేదని.. అభివృద్ధి పనుల్లో శిలాఫలకాల ప్రారంభోత్సవాలకే మంత్రి సబితమ్మ పరిమితం చేశారని మహేశ్వరం సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బడంగ్ పేట కార్పొరేషన్ లోని ఉద్యోగనగర్ కమాన్ నుంచి   గాంధీనగర్, శ్రీనిలయం వరకు  ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ.. కార్పొరేషన్​కు రూ.50కోట్ల ఇస్తామని తుమ్మలూర్​లో హరితోత్సవం సాక్షిగా ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఎక్కడ, ఎప్పుడు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బడంగ్​పేటలో సూపర్​ స్పెషాలిటీ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. మహేశ్వరంలో దళితబంధు, బీసీబంధు ఎంతమందికి ఇచ్చారో మంత్రి సబిత శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

బడంగ్ పేట బీజేపీ, బీజేవైఎం నేతలు గజమాలతో అందెల శ్రీరాములును సత్కరించి ఆహ్వానించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి, కార్పొరేటర్లు అనిత, రమాదేవి, సామ సంజీవరెడ్డి, గుర్రం మల్లారెడ్డి, కార్యకర్తుల పాల్గొన్నారు.