బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం.. కుమ్మక్కైనయ్: ఖర్గే

బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం.. కుమ్మక్కైనయ్: ఖర్గే

ఎల్ బీ నగర్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కయ్యాయని.. అధికారం కోసం ఆరాటపడుతున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. శుక్రవారం హైదరాబాద్​లోని ఎల్ బీ నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్  షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాఫియాలకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ ప్రభుత్వమని.. రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోందని ఫైర్ అయ్యారు. ‘‘తెలంగాణ మహాలక్ష్మి లాంటిది. ఇక్కడ అందరి జేబులో డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులన్నీ కల్వకుంట్ల కుటుంబం లూటీ చేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కమీషన్లు దండుకుని రూ.కోట్లు దోచుకున్నాడు” అని మండిపడ్డారు. కేసీఆర్ పథకాలన్నీ శాంపిల్ పథకాలని విమర్శించారు. కాంగ్రెస్ స్కీమ్స్ ఇవ్వడం మొదలుపెడితే పర్మనెంట్​గా ఇస్తుందని చెప్పారు. ‘‘ఎల్బీ నగర్​లో కాంగ్రెస్ నుంచి గెలిచిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.. తన అక్రమాస్తులను కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ లో చేరారు. తనతో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలను వెంట తీసుకుపోయిండు” అని ఫైర్ అయ్యారు. తెలంగాణతో పాటు చత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 

బీఆర్ఎస్ కు కాలం చెల్లింది: శ్రీనివాస్

బీఆర్ఎస్ కు కాలం చెల్లిందని ఆలిండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ పార్టీనే అని సర్వేలు కోడై కూస్తున్నాయని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు.