కాంగ్రెస్, బీఆర్ఎస్..పోస్టర్ల వార్

కాంగ్రెస్, బీఆర్ఎస్..పోస్టర్ల వార్
  • సోషల్ మీడియాలో పోటాపోటీగా అవినీతి ఆరోపణలు 
  • ‘బుక్ మై సీఎం’ పేరుతో కాంగ్రెస్ క్యాంపెయిన్ 
  •  ‘స్కాంగ్రెస్’ పేరుతో బీఆర్ఎస్ కౌంటర్

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సోషల్ మీడియాలో పోస్టుల వార్ నడుస్తోంది. ‘మీది కమీషన్ల పార్టీ’ అంటూ బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంటే, ‘మీది స్కామ్ ల పార్టీ’ అంటూ కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. బీఆర్ఎస్​ అవినీతికి పాల్పడిందంటూ ‘బుక్​మై సీఎం’ పేరుతో కాంగ్రెస్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. దాన్ని సోషల్ మీడియా వేదికగా జనాల్లోకి తీసుకెళ్తున్నది. బీఆర్ఎస్ అంటే కమీషన్ల పార్టీ అని, కల్వకుంట్ల కుటుంబంలోని వాళ్లంతా కమీషన్లు లేనిదే పనులు చేయరని ఆరోపిస్తున్నది. 

దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ పై బీఆర్ఎస్​ కూడా ఎదురుదాడి మొదలుపెట్టింది. ‘స్కాంగ్రెస్’ పేరుతో ప్రచారం ప్రారంభించింది. స్కామ్​లకే పెద్దన్న కాంగ్రెస్ అని, ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు డొల్ల అని విమర్శలు చేస్తున్నది. 

బీఆర్ఎస్.. కమీషన్ల పార్టీ: కాంగ్రెస్

‘‘బుక్ మై సీఎం.. 30% కమీషన్ మస్ట్’ అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రచారం మొదలుపెట్టింది. దళితబంధు, కల్యాణలక్ష్మి, డబుల్​బెడ్రూం ఇండ్లు సహా ఏ పథకం తీసుకున్నా.. ఎమ్మెల్యేలకు కమీషన్లు ముట్టజెప్పాల్సిందేనంటూ ఆరోపణలు చేసింది. 

‘దళితబంధు స్కామ్ 2023’ పేరుతో పోస్టర్​ను రూపొందించిన కాంగ్రెస్.. ఆ పథకం అందాలంటే 30 శాతం కమీషన్​ను కల్వకుంట్ల కుటుంబం ఖాతాలో వేయాలని అందులో పేర్కొంది. డబ్బులు జమ చేసేందుకు కేటీఆర్​పే, కవిత పే, హరీశ్​రావు పే, సంతోష్​రావు పే అంటూ అందులో ప్రచురించింది. దాంతో పాటు కేసీఆర్ అంటే కె. కమీషన్​రావు అని మరో పోస్టు పెట్టింది. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ మోసమేనని ప్రా‘మిస్’ పేరుతో ఇంకో పోస్టర్ తయారు చేసింది. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, మైనారిటీలకు 12% రిజర్వేషన్లు, ఇంటికో ఉద్యోగం బూటకమని అందులో పేర్కొంది. బీఆర్ఎస్ ​స్కామ్​టికెట్లు 30 శాతం కమీషన్​తో అందుబాటులో కలవంటూ మరో పోస్టర్​ను సోషల్​మీడియాలో పోస్టు చేసింది. 

కాంగ్రెస్.. స్కామ్​ల పార్టీ: బీఆర్ఎస్

కాంగ్రెస్​‘బుక్​మై సీఎం క్యాంపెయిన్’​కు బీఆర్ఎస్​కూడా దీటుగా కౌంటర్ ఇస్తున్నది. ‘ది రేవంత్​ స్టోరీ’ పేరుతో రూ.50 లక్షల స్కామ్​2015 అంటూ ప్రచారం షురూ చేసింది. డబ్బు సూట్​కేసులతో రేవంత్​ఉన్న ఫొటోను పెట్టి.. ఓటుకు నోటు కేసును మళ్లీ తెరపైకి తెచ్చింది. 2008 నుంచి కాంగ్రెస్ చేసిన​ స్కామ్ లు ఇవీ అంటూ ‘స్కాంగ్రెస్​’ పేరుతో మరో పోస్టర్​ను బీఆర్ఎస్ సోషల్ మీడియా సెల్ ట్విట్టర్ లో పోస్టు చేసింది. 2008లో 2జీ  స్కామ్, 2009లో సత్యం స్కామ్, 2010లో కామన్వెల్త్​ గేమ్​స్కామ్, 2011లో ఓటుకు నోటు కుంభకోణం, 2012లో కోల్​స్కామ్, చాపర్​ స్కామ్, టాట్రా ట్రక్​స్కామ్, ఆదర్శ్​ స్కామ్, 2013లో ఐపీఎల్​స్కామ్​అంటూ అందులో పేర్కొంది. 

మరోవైపు కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారంటీలపైనా విమర్శలు గుప్పించింది. రోజు 3 గంటల కరెంట్, నాలుగు వారాలకోసారి నల్లా నీళ్లు, ఆరు నెలలకో సీఎం, నెలకు నాలుగు సార్లే స్కూళ్లు, అన్ని వేళలా అవినీతి చట్టబద్ధం, భూ కబ్జాలో పారదర్శకత అంటూ కాంగ్రెస్​పై బీఆర్ఎస్ ఎదురు దాడి చేసింది.

మంత్రి కమలాకర్ పై 9 ఆరోపణలతో కాంగ్రెస్ చార్జిషీట్​

రోజుకో మంత్రిపై కాంగ్రెస్ పార్టీ చార్జిషీట్లను రిలీజ్ చేస్తున్నది. గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​పై ‘దందాల తలసాని’ అంటూ చార్జిషీట్ రిలీజ్ చేసిన ఆ పార్టీ.. శుక్రవారం మంత్రి గంగుల కమలాకర్​పై ‘కన్నింగ్​కమలాకర్’​ పేరిట చార్జిషీట్ విడుదల చేసింది. ఆయనపై 9 అభియోగాలను మోపింది.