అనుబంధ విభాగాలకు మొండిచెయ్యి.. ఎన్ఎస్​యూఐ, యూత్ వింగ్ లీడర్లకు నో టికెట్

అనుబంధ విభాగాలకు మొండిచెయ్యి.. ఎన్ఎస్​యూఐ, యూత్ వింగ్ లీడర్లకు నో టికెట్
  •     జెండాలు మోసినోళ్లకు చాన్స్ ఇవ్వలేదని ఆవేదన
  •     శివసేనా రెడ్డి,బల్మూరి వెంకట్​లకు నిరాశ 
  •     కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డికీ దక్కని అవకాశం
  •     రాజీనామాలకు సిద్ధమైన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు
  •     ఇయ్యాల రాహుల్ గాంధీని కలవనున్న నేతలు 

హైదరాబాద్, వెలుగు:పార్టీ అనుబంధ విభాగాల లీడర్లకు టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ మొండి చెయ్యి చూపించింది. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్​యూఐ, కిసాన్ కాంగ్రెస్, ఫిషర్​మెన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సెల్స్ సహా ఆయా విభాగాల్లోని చాలా మంది లీడర్లకు టికెట్ ఇయ్యలేదు. దీంతో పలువురు నేతలు లోలోపలే ఆవేదన చెందుతున్నట్టు తెలిసింది. పార్టీ కోసం ఉద్యమాలు నడిపి, జైలుకెళ్లి కేసులు ఎదుర్కొన్నా గుర్తింపు దక్కడం లేదని యువ నేతలు వాపోతున్నారు. ఇంత కష్టపడినా పార్టీ గుర్తించకుంటే రేపటి నాడు పార్టీ అనుబంధ విభాగాల్లోకి యువత ఎలా వస్తారని సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ జరిగినప్పుడుగానీ.. ఇంటర్ వాల్యుయేషన్​లో తప్పులతో విద్యార్థులు సూసైడ్స్ చేసుకున్నప్పుడుగానీ ఎన్ఎస్​యూఐ, యూత్ కాంగ్రెస్ లీడర్లు చేపట్టిన నిరసనలు పార్టీకి మైలేజీని తెచ్చి పెట్టాయి. అలాగే టైమ్‌‌కు పంట కొనుగోళ్లు జరగకపోయినా, పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోయినా కిసాన్ సెల్ నేతలు ఉద్యమాలు నడిపారు. దళిత మహిళ లాకప్ డెత్, దళితులపై అట్రాసిటీలపై ఎస్సీ సెల్, పోడు హక్కులపై ఎస్టీ సెల్ పోరాటం చేశాయి. అయినా కూడా తమకు గుర్తింపు దక్కడం లేదని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

యూత్​ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ డీలా  

టికెట్లు దక్కకపోవడంతో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్​యూఐ విభాగాల లీడర్లు డీలా పడిపోయారు. జాతీయ స్థాయి నేతలు వచ్చినప్పుడు జెండాలు కట్టి, వెంట తిరిగిన తమకు తీవ్ర అన్యాయం చేశారని ఆయా విభాగాల లీడర్లు వాపోతున్నారు. కుటుంబాలను వదిలేసి ఏండ్లపాటు పనిచేసినా ఫలితం దక్కలేదంటున్నారు. సభలు, కార్యక్రమాలు జరిగినప్పుడు యువ లీడర్లే ముఖ్యమని, వాళ్లే జెండాలు మోసేటోళ్లని అంటున్నారు. వాళ్లలో ఎవరికీ టికెట్లు ఇవ్వకుండా పార్టీ పెద్దలు డీలా పడేలా చేశారని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. యువ నేతలకు అవకాశం ఇస్తామన్న రాహుల్ గాంధీ మాటలకూ విలువ లేకుండా పోయిందని వాపోతున్నారు.  

గాంధీభవన్​లో యూత్ కాంగ్రెస్ మీటింగ్ 

యూత్ కాంగ్రెస్ లీడర్లలో ఏ ఒక్కరికీ టికెట్ రాకపోవడంతో ఆ విభాగం ముఖ్య నేతలు, కార్యకర్తలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పార్టీకి రాజీనామా చేస్తామని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, కొందరు ముఖ్య నేతలు చెప్పడంతో గాంధీభవన్​లో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఎవరూ ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవద్దని యూత్ కాంగ్రెస్ స్టేట్​ప్రెసిడెంట్ శివసేనా రెడ్డి వారించారు. దీనిపై సోమవారం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్నట్లు ఆయన చెప్పారు. ఒకటో తేదీన మరోసారి సమావేశమై కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు.

టికెట్ రానోళ్ల లిస్ట్ ఇదే..  

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బల్మూరి వెంకట్​కు ఈసారి పార్టీ టికెట్​ను నిరాకరించింది. ఆయన ప్లేస్​లో పార్టీలో కొత్తగా చేరిన ఒడితెల ప్రణవ్​కు అవకాశం ఇచ్చింది. దీంతో విద్యార్థి ఉద్యమాలను ముందుండి నడిపిస్తున్నా టికెట్ రాకపోవడంతో వెంకట్ నిరాశలోకి జారుకున్నట్టు తెలుస్తోంది. ఇటు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి వనపర్తి టికెట్​ను ఆశించినా.. సీనియర్ నేత చిన్నారెడ్డికే టికెట్​ను కేటాయించింది పార్టీ. దీనిపై శివసేనా రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. వీరితో పాటు టికెట్ కోసం అప్లై చేసుకున్న పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులకూ టికెట్ దక్కలేదు. ఆ విభాగం నుంచి 27 మంది అప్లై చేసుకున్నా ఎవరినీ పరిగణనలోకి తీసుకోలేదు. అంబర్​పేట్ టికెట్ ఆశించిన యూత్ కాంగ్రెస్ హైదరాబాద్ ప్రెసిడెంట్ మోతా రోహిత్, ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్​లకూ టికెట్ రాలేదు. గోషామహల్ టికెట్​ రేసులో నిలిచిన పార్టీ ఫిషర్​మెన్ సెల్ చైర్మన్ మెట్టు సాయికీ టికెట్ దక్కలేదు. తుంగతుర్తి టికెట్ కోసం ఎస్సీ సెల్ చైర్మన్ నాగరిగారి ప్రీతమ్ అప్లై చేసుకున్నారు. అయితే, ఆ స్థానానికి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.  

ఖర్గేకు కోదండ రెడ్డి లేఖ 

కిసాన్ కాంగ్రెస్ తరఫున ఆ సెల్ రాష్ట్ర చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి బాల్కొండ టికెట్​కు అప్లై చేసుకున్నారు. కానీ, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ కుమార్​కు ఆ టికెట్​ను కేటాయించింది పార్టీ అధిష్ఠానం. అన్వేష్ రెడ్డికి టికెట్​ ఇవ్వాలంటూ గతంలో పీసీసీ సహా హైకమాండ్ పెద్దలకూ ఆ విభాగం జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో కోదండ రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. పార్టీలో కొత్తగా చేరినోళ్లకే టికెట్లు ఇస్తున్నారని, పార్టీ కోసం పనిచేసి పోరాడుతున్నోళ్లను పక్కనపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.