కెల్విన్‌పై చార్జ్‌షీట్‌: డ్రగ్స్ కేసులో సినీ తారల పేర్లు లేవ్‌

కెల్విన్‌పై చార్జ్‌షీట్‌: డ్రగ్స్ కేసులో సినీ తారల పేర్లు లేవ్‌

తెలంగాణలో డ్రగ్స్ కలకలంపై ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రధాని నిందితుడు కెల్విన్‌పై చార్జ్‌షీట్‌ను ఫైల్ చేసింది. సినిమా స్టార్స్‌పై కెల్విన్‌ చేసిన ఆరోపణలకు బలమైన ఆధారాలు లేవని, కేసు దర్యాప్తును పక్క దోవ పట్టించడానికే అతడు సినిమా వాళ్ల పేర్లు చెప్పాడని సిట్‌ అందులో పేర్కొంది. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఆ చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఇందులో కెల్విన్ ఇచ్చిన వాగ్మూలంతో పాటు సినీ స్టార్స్‌ విచారణ గురించి కూడా సిట్ ప్రస్తావించింది.

మెయిల్స్, వాట్సాప్‌ ద్వారా ఆర్డర్లు తీసుకుని..

కెల్విన్ మంగళూరులో చదువుకునేటప్పుడు డ్రగ్స్ కు అలవాటు పడ్డాడని సిట్‌ తెలిపింది. గోవా, విదేశాల నుంచి డార్క్ వెబ్ ద్వారా కెల్విన్ డ్రగ్స్ తెప్పించేవాడని పేర్కొంది.  2013 నుంచి తన స్నేహితులకు డ్రగ్స్ అమ్మడం మొదలు పెట్టాడని, వాట్సప్, మెయిల్ ద్వారా ఇతరుల నుంచి ఆర్డర్లు తీసుకొని డ్రగ్స్ సరఫరా చేశాడని చెప్పింది. అడ్రస్‌లు, ఇతర కీలక వివరాలు దర్యాప్తులో కెల్విన్ వెల్లడించలేదని ఎక్సైజ్ శాఖ తెలిపింది. కెల్విన్, అతని స్నేహితులు నిశ్చయ్, రవి కిరణ్ ప్రమేయంపై ఆధారాలున్నాయని చెప్పింది. కెల్విన్‌ను అరెస్ట్ చేసిన రోజు సోదాలు చేస్తుండగా అతడు వంట గది నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడని సిట్‌ చార్జ్‌షీట్‌లో వెల్లడించింది. 

స్టూడెంట్స్, టెకీలకు డ్రగ్స్‌.. తప్పుదోవ పట్టించడానికే సినీ తారల పేర్లు

సినీ తారలు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, హోటల్ నిర్వాహకులకు డ్రగ్స్ అమ్మిననట్లు కెల్విన్ వాంగ్మూలం ఇచ్చాడని సిట్‌ పేర్కొంది. అతడు చెప్పిన విషయాల ఆధారంగా పలువురికి నోటీసులు ఇచ్చి విచారించామని, కెల్విన్‌ సినీ తారలు, సెలబ్రిటీలపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లభించలేదని వెల్లడించింది. సెలబ్రిటీలపై కెల్విన్ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని, కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం విషయాలనే ఆధారాలుగా పరిగణించలేమని, అతడు దర్యాప్తును తప్పుదోవ పట్టించే ఉద్దేశంతోనే సినిమా వాళ్ల పేర్లు చెప్పి ఉండొచ్చని సిట్‌ అభిప్రాయపడింది. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్ వాంగ్మూలం సరిపోదని, అతడు చెప్పిన సెలబ్రిటీలు, ఇతర అనుమానితుల వద్ద డ్రగ్స్ కూడా లభించలేదని, కేవలం అతడి ఆరోపణల ఆధారంగా నిందితులుగా చేర్చలేమని చార్జ్‌షీట్‌లో సిట్‌ పేర్కొంది. పూరి జగన్నాథ్, తరుణ్ స్వచ్ఛందంగా బయో శాంపిల్స్ కూడా ఇచ్చారని, వారి శాంపిల్స్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ తేల్చిందని సిట్‌ వెల్లడించిది. దీంతో నిందితులు, సాక్షుల జాబితాలో సినీ తారల పేర్లను ఎక్సైజ్‌ శాఖ సిట్ పొందుపరచలేదు.