- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి
- ఫ్లోరిడా వర్సిటీ బృందంతో భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని లేటెస్ట్ టెక్నాలజీతో అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయ సహజ వనరులు, పర్యావరణ పాఠశాల ప్రతినిధులు మంత్రి తుమ్మలతో సెక్రటేరియెట్ లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి, సాంకేతిక విస్తరణ, పరిశోధన రంగాల్లో ఉమ్మడి భాగస్వామ్యంపై చర్చించారు.రాష్ట్ర ప్రభుత్వం, హార్టీకల్చర్ వర్సిటీ, ఫ్లోరిడా వర్సిటీ సంయుక్తంగా 'తెలంగాణ డిజిటల్, సుస్థిర వ్యవసాయ వ్యవస్థల కేంద్రం' ఏర్పాటు చేసే అంశంపై డిస్కషన్ జరిగింది. ఈ కేంద్రం ద్వారా డిజిటల్ వ్యవసాయం, కచ్చిత వ్యవసాయం, ఏఐ ఆధారిత పద్ధతులు, రిమోట్ సెన్సింగ్, డ్రోన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలను రైతులకు చేరువ చేయాలని భావిస్తున్నారు.
సమావేశంలో వాతావరణ మార్పులకు అనుగుణమైన పంటల అభివృద్ధి, నేల ఆరోగ్య పరిరక్షణ, నీటి వినియోగ సమర్థత పెంపు వంటి కీలక అంశాలపై ప్రతినిధులు సూచనలు తెలియజేశారు. ప్రత్యేకంగా స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి అధిక విలువ పంటల సాగు, వాటి ప్రాసెసింగ్ టెక్నాలజీల అభివృద్ధి ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే అవకాశాలను వివరించారు. ఇక ఫుడ్ ప్రాసెసింగ్, వ్యాల్యూ యాడెడ్ ఇండస్ట్రీలను ప్రోత్సహించడం ద్వారా రైతులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించాలని ప్రతిపాదించారు.
