- ప్రధాన ప్రాజెక్టుల్లో ఉన్నది 137 టీఎంసీలే
- రాష్ట్రంలోని 6,123 చెరువుల్లో చుక్క నీరు లేదు
- ఎండాకాలం కోసం ఏటా 70 టీఎంసీలు అవసరం
- ఈసారి నాలుగు నెలల ముందే మొదలైన కష్టాలు
- హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌కు నీటి ముప్పు
- తుఫాన్లతో గట్టెక్కిన ఏపీ, తమిళనాడు
హైదరాబాద్, వెలుగు: చలికాలంలోనే తాగునీటి ముప్పు ముంచుకొస్తున్నది. భూగర్భ జలాల నుంచి చెరువుల వరకు.. చిన్న రిజర్వాయర్ల నుంచి పెద్ద ప్రాజెక్టుల వరకు అన్నీ ఇంకిపోతున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల వారానికోసారి నీళ్లు వస్తుండడంతో ఎండాకాలం నాటికి ఇంకెంత గడ్డుపరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయం నెలకొంది. పల్లె నుంచి పట్నం దాకా ఈసారి తాగునీటికి ఇబ్బందులు తప్పేలా లేవు. వాస్తవానికి ఎండాకాలంలో (మార్చి నుంచి జూన్ చివరి వరకు) రాష్ట్ర అవసరాలకు సుమారు 70 టీఎంసీలదాకా వినియోగిస్తుంటారు.
అందులో ఒక్క హైదరాబాద్ సిటీకే 21 టీఎంసీల నీటిని తరలిస్తారు. ప్రస్తుతం అన్ని మేజర్ ప్రాజెక్టుల్లో కలిపి 137 టీఎంసీల (లైవ్స్టోరేజ్) నీళ్లే వాడుకోవడానికి వీలుంది. మీడియం ప్రాజెక్టుల్లో మరో 17 టీఎంసీల దాకా వాడుకోవచ్చు. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటి నుంచే తీవ్రమవుతున్నాయి. దీంతో ఎండాకాలానికి తోడు మరో నాలుగు నెలల పాటు తాగునీటి అవసరాలకు ఆ నీటినే వాడుకోవాల్సిన అవసరం వచ్చి పడింది. ఆవిరి నష్టాలు ఏ స్థాయిలో ఉంటాయో అంతుచిక్కడం లేదు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు తుఫాన్లు అర్నబ్, మురసు రాష్ట్రాన్ని ఏమాత్రం ఆదుకోలేకపోయాయి. మురసు తుఫాను వల్ల కొంతలో కొంత ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఉపశమనం లభించింది. అదే సమయంలో రెండు వారాల పాటు వర్షాలతో పొరుగున ఉన్న ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు నీటి గండం నుంచి గట్టెక్కాయి.
చెరువులు ఎండుతున్నయ్
పల్లెలకు కూడా ఈసారి తాగునీటి బుగులు పట్టుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా 21,500 చెరువులున్నాయి. అందులో 65 శాతం చెరువులు ఎండిపోయాయి. 13,264 చెరువుల్లో నీటి జాడ లేదు. అందులో 6123 చెరువుల్లో చుక్క నీరు కూడా లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో 7,141 చెరువుల్లో కేవలం పావు వంతే నీళ్లున్నాయి. ఈసారి రాష్ట్రంలోని మొత్తం చెరువుల్లో కేవలం 538 చెరువులే పూర్తి స్థాయిలో నిండాయి.
మిగతా చెరువులు అరకొరకగా నిండడంతో ఎండుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో రాబోయే వేసవిలో పల్లెల్లోనూ పరిస్థితులు ఎలా ఉంటాయోననే ఆందోళన రేకెత్తుతున్నది. ఈ సారి ఎండలు మండుతాయని ఇప్పటికే ప్రపంచ వాతావరణ సంస్థతో పాటు మన వాతావరణ కేంద్రాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో ప్రాజెక్టులతో పాటు చెరువుల్లోనూ ఆవిరి నష్టాలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయంటున్నారు. ప్రస్తుతం ప్రధాన ప్రాజెక్టులన్నీ కలిపి ఆవిరి నష్టాలు రోజూ సగటున 2 వేల క్యూసెక్కుల దాకా ఉంటాయని అంచనా. ఎండల తీవ్రతను బట్టి ఈ మొత్తం పెరగవచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
జిల్లాల్లో ఇదీ పరిస్థితి
ఈ సారి పల్లెలకూ తాగునీటి తిప్పలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఏటా ఎండాకాలంలో 3.5 టీఎంసీల దాకా నీళ్లను సరఫరా చేస్తుంటారు. అందులో ఒక టీఎంసీ ఒక్క వరంగల్ పట్టణాల అవసరాలకే సరిపోతాయి. వరంగల్ టౌన్‌తోపాటు జిల్లా మొత్తానికి ప్రధాన సోర్సులు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కాకతీయ కెనాల్, దేవాదుల ప్రాజెక్టులే. ఆ రెండింటి ద్వారానే వరంగల్‌లో ఉన్న భద్రకాళి, రామప్ప, వడ్డేపల్లి వంటి చెరువులను నింపుతారు. కానీ ఈ ఏడాది శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చిందే లేదు. ఆ ప్రాజెక్టులో 36.86 టీఎంసీల నీళ్లుండగా.. డెడ్‌స్టోరేజ్ 14.77 టీఎంసీలు పోనూ ఉండేది మరో 24 టీఎంసీలే. ఉమ్మడి వరంగల్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ (జగిత్యాల, పెద్దపల్లి), ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకూ శ్రీరాంసాగరే ఆధారం. కరీంనగర్‌కు లోయర్ మానేరు, మిడ్‌మానేరుతో పాటు ఎల్లంపల్లి నుంచి నీటిని సరఫరా చేస్తారు.
ఏటా 5 టీఎంసీల నీళ్లు కావాలి. కరీంనగర్ నగరానికే ఒక టీఎంసీ అవసరాలున్నాయి. ఇటు కరువు జిల్లా అయిన ఉమ్మడి పాలమూరు జిల్లా పరిస్థితి మరింత జఠిలంగా మారుతున్నది. ప్రస్తుతం ఆ జిల్లాకు ఏటా ఎండాకాలంలో 3.5 టీఎంసీల నీళ్లు అవసరం ఉండగా.. మహబూబ్‌నగర్ సిటీకి అర టీఎంసీ నీళ్లు కావాలి. ఉమ్మడి నల్గొండ జిల్లా అవసరాలు 5 టీఎంసీలు కాగా.. నల్గొండ సిటీ అవసరాలు ఒక అర టీఎంసీ వరకు ఉంటుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 3 టీఎంసీల దాకా అవసరం అవుతుందంటున్నారు. అందులో అర టీఎంసీ నిజామాబాద్ సిటీ అవసరాలు తీరుస్తాయి. ఈ ఉమ్మడి జిల్లాకు శ్రీరాంసాగర్‌తో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టులే ఆధారం. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులోనూ నీళ్లు లేవు. 9.31 టీఎంసీల నీళ్లుండగా.. డెడ్‌స్టోరేజ్ 5.91 టీఎంసీలు పోనూ.. మిగిలేది 3.4 టీఎంసీలే. మొత్తంగా అన్ని జిల్లాలకు ఏటా 70 టీఎంసీల దాకా అవసరాలుండగా.. ఈ ఏడాది మరింత పెరగొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఎండలు దంచికొడితే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటుందని, నీటి వినియోగం అధికమవుతుందని అంచనా.
గండం గట్టెక్కేనా..
రాజధాని తాగు నీటి అవసరాలకు నాగార్జునసాగరే ఆధారం. ఆ ప్రాజెక్టు నుంచి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ తాగు అవసరాల మేరకు రోజూ 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అందులో కేవలం హైదరాబాద్ అవసరాలకే 1200 క్యూసెక్కులు కావడం గమనార్హం. ఎండాకాలం మొత్తం సిటీకి ఏటా 21 టీఎంసీల వరకు నీటిని తాగు అవసరాలకు విడుదల చేస్తుంటారు. సింగూరు నుంచి రావాల్సి ఉన్నా.. ఇప్పుడు అక్కడి నుంచి నీటిని తీసుకునే పరిస్థితి లేదు. రిపేర్లు చేస్తుండడంతో దానిని ఖాళీ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో కేవలం 2.55 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. అందులోనూ డెడ్‌స్టోరేజ్‌కు పైన వాడుకునేందుకు వీలున్న నీళ్లు 1.8 టీఎంసీలే. ప్రస్తుత పరిస్థితుల్లో సిటీలోని ఇండ్లకు నీటి సరఫరాను తగ్గించేశారు. వారానికోసారి మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ తాగునీటి అవసరాల భారం మొత్తం నాగార్జునసాగర్‌పైనే పడనుంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో కేవలం 49 టీఎంసీలే వాడుకోవడానికి వీలుంది.
