- చిన్న, సన్నకారు రైతులకు ఫామ్ మెకనైజేషన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైతులకు యంత్రాలు ఇచ్చే ఫామ్ మెకనైజేషన్ పథకం అమలుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. పశువుల నిర్వహణ ఖర్చులు పెరగడం, కూలీల కొరత తీవ్రం అవడంతో రైతులు యాంత్రీకరణ వైపు మళ్లుతున్నారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ స్కీమ్‌ను రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.
ఈ పథకం ద్వారా వ్యవసాయ శక్తి లభ్యతను పెంచడం, సబ్సిడీపై వివిధ యంత్రాలు అందించడం, పంటల ఆధారిత కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం వంటివి వాటిని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. రైతుల కష్టాన్ని తగ్గించి పంట ఉత్పాదకతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ఫామ్ మెకనైజేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. సబ్-మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ (ఎస్‌ఎంఏఎం) స్కీమ్ ను వినియోగించుకుని చిన్న, సన్నకారు రైతులకు 50 శాతం రాయితీతో వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి తెస్తున్నారు.
రైతుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని యంత్రాల ఎంప్యానెల్‌కు వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు సమర్పించింది. వ్యవసాయ శాఖ ఈ స్కీమ్ కింద రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులతో అమలయ్యే ఎస్‌ఎంఏఎం స్కీమ్‌లో చిన్న, సన్నకారు రైతులకు, తక్కువ యాంత్రీకరణ ఉన్న ప్రాంతాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా చిన్న భూములు, వ్యక్తిగత యంత్రాల ఖర్చు సమస్యలను పరిష్కరించేందుకు కస్టమ్ హైరింగ్ సెంటర్లను ప్రోత్సహిస్తున్నారు.
దరఖాస్తు విధానం.. అర్హతలు
ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక కోసం రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. రైతులు నేరుగా ఏఈఓలు, ఏఓలకు దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు అంటూ ఏమీ లేదు. భూభారతిలో నమోదైన వ్యవసాయ భూమి ఉండి పట్టా పాస్‌బుక్ ఉన్న రైతులు ఈ యంత్రాలు పొందేందుకు అర్హులు. రైతులు స్థానిక అగ్రికల్చర్ అధికారులను కలిసి పట్టాపాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ అందించి అప్లై చేసుకోవచ్చు.
యంత్రాలకు ఎంపానెల్
రాష్ట్రంలో వ్యవసాయ యంత్ర పరికరాల ఎంపానెల్ మెంట్ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలవారీగా మార్గదర్శకాలను రూపొందించింది. అదేవిధంగా జిల్లా అగ్రికల్చర్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. యాంత్రీకరణను మరింత బలోపేతం చేయడానికి 17 పరికాలతో పాటు మరో తొమ్మిది సాధనాల ఎంపానెల్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది.
భూమి సన్నద్ధత కోసం పవర్ ఆగర్, పోస్ట్ హోల్ డిగ్గర్, వీడ్ స్లాషర్, హార్వెస్టింగ్ పోల్స్, పసుపు బాయిలర్ వంటి పరికరాలను వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. ప్లాంట్ ప్రొటెక్షన్ కు వినియోగించే పరికరాల్లో బ్యాటరీ, ఫుట్‌హోల్డ్, మ్యానువల్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు, కిసాన్ డ్రోన్లు ఉన్నాయి. ట్రాక్టర్ ఆధారిత సాధనాల్లో రొటోవేటర్లు, సీడ్- కమ్ -ఫర్టిలైజర్ డ్రిల్స్, డిస్క్ హారోలు, కల్టివేటర్లు, రొటోపడ్లర్లు ఉన్నాయి.
