- ఇప్పటి వరకు రూ.432 కోట్ల విలువైన 1.82 లక్షల టన్నుల కొనుగోలు
- కొనుగోళ్లు ప్రారంభమై 45 రోజులైనా రైతులకు పైసా అందలే
- రాష్ట్ర సర్కారు స్పందించాలని రైతుల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్‌కు సంబంధించి మక్కల కొనుగోళ్లు మొదలై 45 రోజులైనా.. రైతులకు ఇప్పటివరకు పైసా అందలేదు. దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సర్కార్ స్పందించాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రూ.437 కోట్ల విలువైన 1.82 లక్షల టన్నుల మక్కల కొనుగోళ్లు జరిగాయి. మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించి మక్కల కొనుగోళ్లు చేస్తోంది.
26 జిల్లాల్లో 226 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి, మద్దతు ధరతో మక్కలు కొనేందుకు సన్నాహాలు చేసింది. ఇప్పటికే 183 కొనుగోలు సెంటర్లలో ప్రభుత్వం మక్కలు కొంటోంది. క్వింటాల్‌కు రూ.2,400 చొప్పున మద్దతు ధరతో కొనుగోలు చేపట్టింది. ఇప్పటి వరకు మక్కలు కొనుగోళ్లు ప్రారంభించి, దాదాపు నెలన్నర అవుతున్నా రైతులకు ఒక్క పైసా అందలేదు.
మార్క్‌ఫెడ్‌కు బ్యాంకుల నుంచి లోన్లు రాకపోవడమే రైతులకు మక్కల పైసలు రాకపోవడానికి కారణమని తెలుస్తోంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు పూచికత్తు ఇస్తే మార్క్‌ఫెడ్ రుణాలు తీసుకుని రైతులకు చెల్లింపులు చేస్తుంది. ఇప్పటి వరకు ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో చెల్లింపులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
16 లక్షల టన్నుల దిగుబడి అంచనా..
ఈ వానాకాలంలో 6.74 లక్షల ఎకరాల్లో మక్కలు సాగు చేయగా, 16.85 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే పంట చేతికి రావడంతో అక్టోబర్ 17 నుంచి మార్కెఫెడ్ ద్వారా కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించింది.
ఒక్కో ఎకరానికి 25 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ సీజన్‌లో మొత్తం 8.66 లక్షల టన్నుల మక్కలను కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేసింది. రాష్ట్రంలో అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లాలో 5,273 మంది రైతుల నుంచి 27,371 టన్నుల మక్కలు సేకరించింది.
