అణాపైసా అప్పు పుడ్తలే నన్ను కోసినా ఎక్కువ ఆదాయం రాదు

 అణాపైసా అప్పు పుడ్తలే నన్ను కోసినా ఎక్కువ ఆదాయం రాదు
  • కేసీఆర్​ చేసిన అప్పులు, పెట్టిన బాకీల వల్లే ఈ దుస్థితి
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి  బాగోలేదు.. ఏం చేయాల్నో  మీరే చెప్పండి
  • ఉద్యోగ సంఘాల నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్​రెడ్డి
  • సర్కారు నడవాలంటే ప్రతి నెలా రూ. 22 వేల కోట్లు కావాలి
  • 18,500 కోట్లకు మించి రూపాయి ఎక్కువ వస్తలేదు
  • తెలంగాణ వాళ్లను బ్యాంకర్లు దొంగలను చూసినట్లు చూస్తున్నరు 
  • ఉద్యోగ సంఘాల సమరం 4 కోట్ల ప్రజలపైనా?
  • పేదల పెన్షన్లు ఆపేసి మనం బోనసులు తీసుకుందమా?
  • ఉద్యోగులు కోర్కెల కోసం దీక్షలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతది 
  • దయచేసి అర్థం చేసుకోండి.. ప్రభుత్వానికి సహకరించండి
  • కేసీఆర్​ పోతూ పోతూ రూ. 8 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయిండు
  • రిటైర్​మెంట్​ బెనిఫిట్స్‌ నుంచి తప్పించుకునేందుకు 
  • రిటైర్మెంట్‌ ఏజ్​ను మూడేండ్లు పెంచిపోయిండు
  • ఆ బెనిఫిట్స్​ కూడా  రూ.8,500 కోట్లు బాకీ పెట్టిండు
  • పాత అప్పుల వడ్డీలకు, కిస్తీలకు ప్రతి నెలా రూ. 7వేల కోట్లకు పైనే కడ్తున్నట్లు వెల్లడి

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదని, అప్పు పుడుతలేదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘గత సర్కార్​ చేసిన అప్పులకు, పెట్టిన బాకీలకు ఇప్పుడు ఎవరూ అణా పైసా ఇస్తలేరు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నరు.. ఢిల్లీకి పోతే ఎవరూ అపాయింట్‌మెంట్‌ కూడా ఇస్తలేరు.. వీళ్లు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతరేమోనన్నట్టుగా చూస్తున్నరు” అని తెలిపారు. ప్రస్తుతం ప్రతి నెలా 18 వేల కోట్ల నుంచి 18,500 కోట్లు ఆదాయం వస్తున్నదని, ప్రభుత్వం నడవాలంటే ప్రతి నెలా రూ.22 వేల కోట్లు కావాలని, అంటే ప్రతి నెలా 4 వేల కోట్లు అదనంగా ఆదాయం రావాలని చెప్పారు.  కేసీఆర్​పోతూ పోతూ రూ. 8 లక్షల 29 వేల కోట్ల అప్పు చేసి పోయారని.. -ఆ అప్పుల వడ్డీలకు, కిస్తీలకు ప్రతి నెలా రూ. 7 వేల కోట్లకుపైనే కట్టాల్సి వస్తున్నదని తెలిపారు. 

ఎక్కడ పడితే అక్కడ 11 శాతం మిత్తికి కేసీఆర్​ అప్పులు తెచ్చారని.. పైగా, అన్ని సంస్థలకు కోట్లకు కోట్లు బాకీలు పెట్టిపోయారని.. రిటైర్మెంట్‌‌ బెనిఫిట్స్​ నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగుల రిటైర్మెంట్​ ఏజ్​ను ఏకంగా మూడేండ్లు పెంచారని ఆయన మండిపడ్డారు. ‘‘నన్ను కోసినా కూడా 18,500 ‌‌‌‌కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి లేదు.. ఏం చేయాలో ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పాలి. నన్ను కోసుకొని తింటరా.. వండుకొని తింటరా..? ఏం చేస్తరు..? వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటరా.. ఉచిత కరెంటు, షాదీముబారక్ ఆపమంటరా.. ఏది ఆపమంటరో.. ఆపుతారో ప్రజలకు మీరే చెప్పండి. అప్పు పుడితే  నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి ఇచ్చే వాడిని. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, దివాలా తీయించిన పెద్దమనిషి ఫామ్​హౌస్​ల సేదదీరుతున్నడు” అని సీఎం వ్యాఖ్యానించారు.

 ఇండియా జస్టిస్ రిపోర్ట్‌‌–2025లో తెలంగాణ పోలీస్​ దేశంలో నంబర్  1గా నిలిచిన సందర్భంగా.. ఓ ప్రైవేట్​ మీడియా సంస్థ ‘రియల్ హీరోస్‌‌’ పేరిట పోలీసులుకు అవార్డులు ప్రదానం చేసింది. హైదరాబాద్​లోని  కమాండ్ అండ్‌‌ కంట్రోల్‌‌సెంటర్‌‌‌‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌, డీజీపీ జితేందర్ సహా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. 

సమరం ఎవరిపైన..? 4 కోట్ల ప్రజలపైనా..? 

ఓ పత్రికలో ‘ఇక సమరమే..’ పేరుతో వచ్చిన వార్తకు స్పందిస్తూ.. ఎవరిపై సమరం చేస్తారని ఉద్యోగ సంఘాల నాయకులను సీఎం రేవంత్​ అడిగారు. ‘‘పొద్దున్నే పేపర్లు చూడంగనే కొన్ని సర్‌‌‌‌ప్రైజ్​ వార్తలు కనిపిస్తుంటయ్​. ఈ రోజు ఒక పేపర్ తెరువంగానే ‘ఇక సమరమే’ అనే వార్తను చదివిన.. ఎవరో వీళ్లు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్లు కాదేమో, ఇంకెవరన్నా మన మీద సమరం ప్రకటించారా..? అని చదివితే.. వాళ్లంతా ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులే. దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్న. ఈ రాష్ట్రం మీది, ఈ ప్రభుత్వం మీది.  మీరందరూ కలిసి ఎన్నుకుంటేనే మేమందరం ఇక్కడున్నం. ఈ రోజు ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు మనమందరం కలిస్తే 2 శాతం.

 ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని లెక్కకడితే దాదాపుగా 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 3 లక్షల మంది కాంట్రాక్ట్‌‌, ఔట్‌‌సోర్సింగ్‌‌ఉద్యోగులు, మరో 3 లక్షల మంది రిటైర్డ్‌‌  ఉద్యోగులు ఉంటారు. దాదాపుగా మొత్తం  9 లక్షల మంది సిబ్బంది ఉండే అవకాశం ఉంది. ఈ 9 లక్షల మంది 4 కోట్ల తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్రంలో శాంతి భద్రతలను, పెట్టుబడులను అన్నింటినీ కాపాడాలి. కానీ ఆ 4 కోట్ల మందిపైనే సమరం చేయడం ఏమిటి?’’ అని ఉద్యోగ సంఘాల నేతలను ఆయన ప్రశ్నించారు. 

పెన్షన్లు ఆపేసి బోనసులు తీసుకుందామా? 

కొన్ని రాజకీ పార్టీలు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నాయని సీఎం మండిపడ్డారు. అలాంటి పార్టీల నాయకుల చేతుల్లో పావులుగా మారొద్దని ఉద్యోగ సంఘాల నేతలకు ఆయన సూచించారు. ‘‘బాధ్యతాయుతంగా ప్రభుత్వానికి సహకరించాల్సిన ఉద్యోగులే.. సమరం అంటే ఎట్ల? ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు ఏంచేసినా .. వ్యవస్థ కుప్పకూలుతుంది. పెన్షన్లు, పథకాలు ఆపేసి.. బోనసులు తీసుకుంటం, జీతాలు పెంచుకుంటం, మేం తినంగ మిగిలినవే ఇస్తమని ప్రజలకు చెప్తే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం. పది లక్షల మందిని తెస్త. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి. ముఖ్యమంత్రికి చిట్టీ ఇచ్చినం.. దీని ప్రకారం పరిపాలన సాగుతదని చెప్పండి. 

లేదంటే రూ.100 ఉన్న పెట్రోలును రూ.200 చేద్దామా..?  పప్పు, ఉప్పు,చింతపండు రేట్లను రెండింతలు చేద్దామా.. చెప్పండి.. ధరలు పెంచకుండా, ఉన్న పథకాలు ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారం. ఉన్నంతలో గౌరవంగా సంసారం నడిపితే బజారులో ఎవ్వడైనా నమ్ముతడు.. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజారున పడేసుకుంటే ఎట్లుంటదో ఉద్యోగ సంఘ నాయకులారా ఆలోచించండి. రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబం. ఈ కుటుంబ పరువును మీరు బజారున పడేస్తామంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను చెప్తున్న. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. 

లక్షా 58వేల కోట్లు తెచ్చి పాత అప్పులకే కట్టినం

ఉద్యోగులు కొత్త కొత్త కోర్కెలు, డిమాండ్లతో నిరసనలు, ధర్నాలు, దీక్షలు, బంద్​లు చేపడితే ఉన్నవ్యవస్థ కూడా కుప్పకూలుతుందని, ఉన్నది కూల్చుకుంటే తేరుకోవడానికి ఇంకేమీ లేదని, ఇంకో దివాలా రాష్ట్రంగా మారుతామని అన్నారు. ‘‘ఇయ్యాల మీరు సమరాలు చేస్తే శాంతి భద్రతలు దెబ్బతింటయ్​. ఉద్యోగ సంఘాల నాయకులారా.. నేను మిమ్మల్ని కొట్టను, తిట్టను, నేను ఒక్కన్ని ఏమీ చేయను. నాకేమున్నది.. నేను ఒక్కరూపాయి ఇంటికి తీసుకుపోను.. నేను మిగితా వాళ్లలాగా కాదు.. ఉన్నది ప్రజలకు వివరిస్త. ప్రభుత్వంలో దుబారా ఖర్చు తగ్గించినం.. రూపాయి రూపాయికి లెక్కలు కడ్తున్నం..  విదేశాలకు పోవాలంటే సీఎంగా ప్రత్యేక విమానంలో వెళ్లొచ్చు. 

కానీ, సాధారణ విమానాల్లో వెళ్తున్న’’ అని రేవంత్ రెడ్డి  వివరించారు. ‘‘16 నెలల్లో మనం లక్షా 58 వేల కోట్లు అప్పు తెస్తే.. పోయినాయిన చేసిన అప్పుకు, అసలుకు, మిత్తికి కలిపి లక్షా 52 వేల కోట్ల రూపాయలు కట్టినమని రామకృష్ణారావు చెప్పారు. అప్పుగా తెచ్చిన ఏ ఒక్క రూపాయి కూడా ప్రజాసంక్షేమం కోసమో, ప్రభుత్వ ఉద్యోగుల కోసమో వాడలేదు.. ఆయన(కేసీఆర్​) పెట్టిపోయిన  రూ. 8 లక్షల 29 వేల కోట్ల అప్పులు, బకాయిలకే ఈ సొమ్మంతా చెల్లించినమని రామకృష్ణారావు  వివరించారు. ఇప్పుడు నెలకు రూ.7 వేల కోట్లు అసలు, మిత్తి కట్టాల్సిన పరిస్థితి ఉంది. మనం తిన్నా, తినకపోయినా నెలకు రూ.7 వేల కోట్లు ప్రతి నెలా కట్టాల్సిందే. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్లు ఉన్న అప్పు.. ఈ రోజు రేవంత్‌‌రెడ్డి సీఎంగా పదవి చేపట్టిన తర్వాత మొదటి 16 నెలల్లో ఒక లక్షా 52 వేల కోట్ల రూపాయలు కట్టినమంటే.. ప్రతి నెలా సగటున రూ. 9 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లు అసలు, మిత్తి కట్టినం.. కట్టుకుంట వచ్చినందుకు కొంత అప్పు భారం తగ్గింది” వివరించారు. 

 రిటైర్మెంట్‌‌ బెనిఫిట్స్​ నుంచి తప్పించుకునేందుకే అట్ల చేసిండు

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు నాటి సీఎం కేసీఆర్​ పొడిగించారని, రిటైర్మెంట్‌‌ బెనిఫిట్స్‌‌ నుంచి తప్పించుకునేందుకే  మూడేండ్లు పెంచారని రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘అట్ల ఆయన పెంచిపోవడంతో ఈ మధ్య కాలంలో అత్యధికంగా ఉద్యోగులు రిటైర్‌‌‌‌ అయ్యారు. ఆయన(కేసీఆర్​) పోతుపోతూ.. మీ రిటైర్మెంట్‌‌ బెనిఫిట్స్‌‌ ఇవ్వకుండా బకాయిలు పెట్టింది ఎంతా అంటే రూ. 8,500 కోట్లు. ఈరోజు నెలనెలా మీకు జీతాలు ఇవ్వడం ఒక ఎత్తయితే 3 లక్షల మంది రిటైర్డ్‌‌ ఉద్యోగులకు రిటైర్​మెంట్స్​ బెనిఫిట్స్​ మరో ఎత్తు. పెన్షన్లు ఇవ్వడం ఇంకో ఎత్తు . 

ఇయ్యాల వాటిని ఒక పక్కన క్రోడీకరిస్తూ.. క్రమబద్ధీకరిస్తూ ముందుకు సాగుతున్నాం. అలాగని సంక్షేమ పథకాలను ఆపలేదు. పెన్షన్లు ఆపలేదు. రైతుభరోసా, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ఆపలేదు. రైతులకు ఉచిత కరెంటు ఆపలేదు. అదనంగా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నం. ఫీజ్ రీయింబర్స్​మెంట్‌‌ చెల్లించే ప్రయత్నం చేస్తున్నం. 25,55,364 మంది రైతులకు రూ.20,617 కోట్లు రుణమాఫీ చేసినం’’ అని అన్నారు.

పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న

దేశంలో నంబర్ వన్  గా నిలిచిన రాష్ట్ర పోలీసులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.  ‘‘హోంశాఖ నా ఆధ్వర్యంలోనే ఉంది కనుక నేను అధికారికంగా చెప్పగలుగుతున్న. పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాములాంటిది. 23 గంటల 59 నిమిషాలు మీరు అప్రమత్తంగా ఉన్నా.. ఒక్క నిమిషం కన్నుమూసి తెరిచేలోగా  ఏమన్నా జరిగితే మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు వస్తది. 

ఎంత నిబద్ధతతో, కష్టంతో పనిచేసినా ఎక్కడో ఒక దగ్గర పోలీసులు విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటరు. ఒక శాతమో, రెండు శాతమో శాఖలో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యమో, అవగాహన లోపమో.. పోలీస్ శాఖ మీద కొంత అనుమానాలు రేకెత్తించే అవకాశం ఉన్నది. కానీ అలాంటి అనుమానాలు, అక్కడక్కడ జరిగే అవమానాలను దిగమింగుకుని ఉద్యోగ ధర్మంలో, విధి నిర్వహణలో పోలీసులు నూటికి నూరు శాతం కష్టపడుతున్నరు కాబట్టే..  తెలంగాణ రాష్ట్రం ప్రశాతంగా ఉన్నది.  యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌‌లో చదివే పిల్లలను ఈ సమాజంలో డాక్టర్లుగా, ఇంజినీర్లుగా , ఐఏఎస్‌‌లుగా, ఐపీఎస్‌‌లుగా, ప్రజాప్రతినిధులుగా, రాష్ట్రానికి నాయకత్వం వహించే నాయకులుగా తీర్చిదిద్దాలన్నదే  నా ఆలోచన, నా విధానం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా హోంగార్డు నుంచి డీజీపీ వరకు విజ్ఞప్తి చేస్తున్న” అని సీఎం సూచించారు.  

ఎక్కడపడితే అక్కడ 11% మిత్తికి అప్పు తెచ్చిండు

మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌ను ఉద్దేశిస్తూ..‘‘ఆయన పెండింగ్‌‌ పెట్టిపోయిన రైతుబంధు రూ.7,625 కోట్లను నేను వచ్చిన మూడు నెలల్లోనే చెల్లించిన. ఈ 15, 16 నెలల్లో రైతుల కోసమే రూ.30 వేల కోట్లు ఉపయోగించినం. ఆర్టీసీకి రూ.5వేల కోట్లు కట్టి నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించే ప్రయత్నం చేస్తున్న. ఆయన ఉచిత కరెంట్​ పేరుమీద విద్యుత్‌‌ శాఖకు వేల కోట్లు బకాయి పెట్టిండు. సింగరేణికి వేల కోట్లు బాకీ పెట్టిండు. ప్రాజెక్టులు కట్టిన అన్నడు కానీ, కాంట్రాక్టర్లకు రూ.50 వేల కోట్లు బాకీ పెట్టిపోయిండు.  

ఎంత మిత్తికి దొరికితే అంత, ఏడ దొరికితే అక్కడ  11 శాతం మిత్తికి అప్పులు తెచ్చిండు. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడ ఉంటది? కష్టపడి కట్టిన ఔటర్ రింగ్‌‌ రోడ్డును రూ. 7.5 వేల కోట్లకు ఎవనికో అమ్ముకుని పోయిండు. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ భూములన్నీ అమ్ముకున్నడు. నేను వచ్చిన తర్వాత ఒక్క గుంట భూమి కూడా అమ్మలేదు. పాత అప్పులు కట్టడానికే నేను అప్పులు చేసిన. భవిష్యత్తులో కూడా ప్రతి నెలా రూ.10 కోట్ల అప్పు చేస్తే కూడా రూ.9 వేల కోట్లకు పైగా పాత అప్పుల మిత్తికే కట్టాలి’’ అని సీఎం రేవంత్​రెడ్డి వివరించారు.