- పన్నుల వాటా కాకుండా స్థానిక సంస్థలు, హెల్త్, డిజాస్టర్ కింద ఫండ్స్
- ఏటా సగటున రూ.6,063 కోట్లు
- పైసలు కావాలంటే ‘దమ్మిడీ’ లెక్క తేలాల్సిందే
- ఎన్నికలు, ఆడిట్‌పై 16వ ఆర్థిక సంఘం ‘ఖతర్నాక్’ రూల్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి రాబోయే ఐదేండ్లలో రూ.30,315 కోట్లు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర పన్నుల్లో వచ్చే వాటా కాకుండా, కేవలం వివిధ గ్రాంట్ల రూపంలోనే ఈ నిధులు రానున్నాయి. అంటే.. ప్రతి ఏటా సగటున రూ.6,063 కోట్లు నేరుగా రాష్ట్ర ఖజానాకు చేరనున్నాయి. గత 15వ ఆర్థిక సంఘం కేటాయించిన మొత్తం గ్రాంట్లు రూ.21,300 కోట్లతో పోలిస్తే.. ఈసారి ఏకంగా రూ.9,015 కోట్లు అదనంగా లభించనున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థలు, వైద్యం, విపత్తు నిర్వహణ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు కీలకం కానున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుంటూనే, క్షేత్రస్థాయి పాలనను బలోపేతం చేసేలా కమిషన్ తన సిఫార్సులను రూపొందించింది. మొదటి ఏడాది అంటే.. రానున్న ఆర్థిక సంవత్సరం 2026–-27లో గ్రాంట్ల రూపంలో రూ.4 వేల కోట్లకు పైగా అందనుండగా, చివరి ఏడాది 2030–-31 నాటికి ఈ మొత్తం రూ. 7,200 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే ఐదేండ్ల కాలంలో నిధుల కేటాయింపు దాదాపు 80 శాతం వృద్ధి చెందనుంది. ఈ నిధులను ప్రధానంగా 4 కంపోనెంట్లుగా విభజించారు.
అందులో గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్లు, పట్టణ స్థానిక సంస్థల గ్రాంట్లు, ఆరోగ్య రంగ గ్రాంట్లు, విపత్తు నిర్వహణ నిధులు ఉన్నాయి. కేంద్ర పన్నుల వాటా కాకుండా అందే ఈ నిధులు రాష్ట్ర అభివృద్ధికి అదనపు బలాన్ని ఇస్తాయి. గతం కంటే మెరుగైన కేటాయింపులు దక్కడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ముందు ఉంచిన సమర్థవంతమైన గణాంకాలు, వినతులు ప్రధాన పాత్ర పోషించాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నిధుల వినియోగంలో కమిషన్ విధించిన రూల్స్ పాటిస్తూ, పారదర్శక పాలన అందించడం రాష్ట్ర ప్రభుత్వానికి కీలకం కానుంది.
గ్రామాలకు రూ.9,968 కోట్లు..
గతంలో స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లలో సింహభాగం గ్రామీణ ప్రాంతాలకే దక్కేది. 15వ ఆర్థిక సంఘం చివరి నాటికి ఇది 65:35 నిష్పత్తిలో ఉండేది. కానీ, 2031 నాటికి దేశ జనాభాలో దాదాపు 40.73 శాతం మంది పట్టణాల్లోనే నివసిస్తారని అంచనా వేసిన 16వ ఆర్థిక సంఘం.. నిధుల పంపిణీని 60:40 (గ్రామీణ:పట్టణ) నిష్పత్తికి మార్చింది. అంటే, మొత్తం గ్రాంట్లలో 40 శాతం నిధులు ఇకపై మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకే దక్కుతాయి.
గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి కమిషన్ రూ.9,968 కోట్లను కేటాయించింది. దేశవ్యాప్త గ్రామీణ జనాభాలో తెలంగాణ వాటా, వైశాల్యం, స్థానిక సంస్థల పనితీరు ఆధారంగా ఈ నిధులు ఖరారయ్యాయి. 2026–27లో రూ.1,280 కోట్లతో మొదలై, ప్రతి ఏటా పెరుగుతూ 2030–31 నాటికి రూ. 2,601 కోట్లకు ఈ నిధులు చేరుతాయి. గతంలో 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన రూ.7,500 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 33% ఎక్కువ. ఈ నిధులలో 80% బేసిక్ గ్రాంట్లుగా అందుతాయి.
పట్టణ స్థానిక సంస్థల గ్రాంట్ల విషయంలో తెలంగాణ ఈసారి రికార్డు స్థాయి నిధులను దక్కించుకుంది. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రం కావడంతో రూ.11,548 కోట్ల భారీ నిధిని కమిషన్ సిఫార్సు చేసింది. పట్టణ గ్రాంట్ల వాటాలో తెలంగాణకు 3.98 శాతం వెయిటేజీ ఇచ్చారు. 2026–27లో రూ.1,483 కోట్లు అందనుండగా.. చివరి ఏడాది నాటికి అది రూ.2,923 కోట్లకు పెరుగుతుంది.
గత 15వ ఆర్థిక సంఘం కేటాయించిన రూ.8,200 కోట్లతో పోలిస్తే ఇది సుమారు రూ.3,348 కోట్లు అధికం. ఈ నిధులు హైదరాబాద్ వంటి మెట్రో నగరాలతో పాటు రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడతాయి.
హెల్త్ గ్రాంట్లు గతం కంటే రూ.1,250 కోట్లు ఎక్కువ
ఆరోగ్య రంగానికి సంబంధించి తెలంగాణకు ఈసారి ప్రత్యేక వరాలు లభించాయి. స్థానిక సంస్థల గ్రాంట్ల నుంచి ప్రత్యేక పనితీరు గ్రాంట్ల నుంచి కలిపి ఆరోగ్య రంగానికి ఐదేండ్లలో రూ.5,100 కోట్లు అందనున్నాయి. ఏటా సగటున రూ.1,020 కోట్లు కేవలం వైద్య సేవలకే ఖర్చు చేసే వీలుంటుంది. ఈ నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునికీకరణ, బస్తీ దవాఖానాల విస్తరణ, డయాగ్నస్టిక్ సెంటర్ల బలోపేతం చేయవచ్చు. శిశు మరణాల రేటు, మాతృ మరణాల రేటు తగ్గించడంలో తెలంగాణ ప్రగతిని కమిషన్ మెచ్చుకుంది.
విపత్తు నిర్వహణకు భారీగా గ్రాంట్లు
విపత్తు నిర్వహణ నిధులలో రాష్ట్రానికి ఐదేండ్ల కాలానికి రూ.3,699 కోట్లు రానున్నాయి. ఇందులో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద రూ.2,959 కోట్లు, స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ కింద రూ.740 కోట్లు కేటాయించారు. ఏటా సగటున రూ.740 కోట్లు విపత్తుల సహాయం కోసం అందుతాయి. గతంలో 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన రూ.2,800 కోట్లతో పోలిస్తే ఇది సుమారు రూ.900 కోట్లు ఎక్కువ. ఈ నిధులలో కేంద్రం వాటా 75% (రూ. 2,774 కోట్లు) కాగా, రాష్ట్రం తన వంతుగా 25% వాటా వేయాల్సి ఉంటుంది.
అదనపు ఆదాయానికి రూల్స్ పాటించాల్సిందే..
నిధుల విడుదలకు సంబంధించి కమిషన్ కొన్ని కఠిన నిబంధనలను విధించింది. గ్రాంట్లు పొందాలంటే స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. అలాగే, మున్సిపాలిటీలు తమ సొంత ఆదాయాన్ని ఏటా కనీసం 5%, గ్రామ పంచాయతీలు 2.5% వృద్ధిని సాధించాలి. ఆడిట్ నివేదికలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి.
రాష్ట్ర ఆర్థిక సంఘం నివేదికలను దానిపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌ను సకాలంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. ఈ నిబంధనలు పాటిస్తేనే కేంద్రం నుంచి బేసిక్ పెర్ఫార్మెన్స్ గ్రాంట్లు పూర్తి స్థాయిలో అందుతాయని కమిషన్ స్పష్టం చేసింది.
తెలంగాణలో విద్యుత్ రంగం అత్యధిక నష్టాలను నమోదు చేస్తోంది. ఆ తర్వాత మౌలిక సదుపాయాల రంగం, వ్యవసాయ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని వెల్లడించింది. 2022–23లో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థలకు రూ.8,431 కోట్ల భారీ సబ్సిడీలను ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొంది. పునర్నిర్మాణం ద్వారా ఖజానాపై భారం తగ్గించుకోవాలని కమిషన్ సూచించింది.
