యువతను గ్లోబల్ వర్క్ఫోర్స్గా తీర్చిదిద్దుతం : శ్రీధర్ బాబు

యువతను గ్లోబల్ వర్క్ఫోర్స్గా తీర్చిదిద్దుతం : శ్రీధర్ బాబు
  • స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్​స్కిల్లింగ్​పై ప్రత్యేక దృష్టి: శ్రీధర్​ బాబు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ యువతను ప్రస్తుత అంతర్జాతీయ స్థాయి అవసరాలకు తగ్గట్టుగా ‘గ్లోబల్ వర్క్ ఫోర్స్’గా తీర్చి దిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. అందుకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. శుక్రవారం హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్ లో నిర్వహించిన ‘ఫ్యూచర్ ఆఫ్ ఇంటెలిజెంట్ అండ్ ఎవాల్వ్డ్ స్ట్రాటజీస్ ఇన్ టాలెంట్ ఆక్విజిషన్ (ఫీస్టా) 2026’  సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థ గమనాన్ని శాసించేది మూలధనం కాదని, నైపుణ్యం మాత్రమేనని చెప్పారు. నిరంతరం నేర్చుకునే తత్వం ఉన్న చోటే ప్రతిభ నిలుస్తుందని, అదే వృద్ధికి అసలైన ప్రాతిపదిక అన్నారు. దేశ వృద్ధి రేటు సుమారు 7 శాతం వరకు ఉండొచ్చని తాజాగా విడుదలైన కేంద్ర ఆర్థిక సర్వే అంచనా వేసిందన్నారు. ఇది శుభపరిణామని, అయితే.. ఈ వృద్ధిని నిలబెట్టుకోవాలంటే కేవలం బడ్జెట్ కేటాయింపులు సరిపోవని, సంస్థాగత సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కృత్రిమ మేధపై ఆధారపడటం కంటే, దానిని సమర్థవంతంగా వాడుకునేలా సంస్థలు రూపాంతరం చెందాలని, లేకపోతే దీర్ఘకాలంలో సవాళ్లు ఎదురయ్యే ప్రమాదముందని చెప్పారు.

కేవలం ఉద్యోగాలను సృష్టించే రాష్ట్రంగానే కాకుండా, పరిశ్రమలకు భవిష్యత్తు భాగస్వామిగా మార్చేలా తెలంగాణను తీర్చి దిద్దుతున్నామన్నారు. అత్యుత్తమ మానవ వనరులకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణను నిలపడంలో ఏఐ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఐకాం, లైఫ్ సైన్సెస్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్​ స్కూల్స్ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కార్యక్రమంలో అంతర్జాతీయ, జాతీయ టెక్ కంపెనీలకు చెందిన హెచ్ ఆర్ హెడ్స్, సోషల్ టాలెంట్ ఫౌండర్ జానీ క్యాంప్ బెల్, క్యారలాన్ గ్లోబల్ సొల్యూషన్స్ ఎండీ పవన్ సచ్ దేవా, క్రౌడ్ స్ట్రైక్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్​ మీనన్, ప్రముఖ నటి, రచయిత్రి మందిరాబేడీ, ఫీస్టా 2026 ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు హరికృష్ణ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.