ఉచిత విద్యుత్ లొల్లి..కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

ఉచిత విద్యుత్ లొల్లి..కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

‘తెలంగాణలో 95% రైతులు మూడెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులు. ఒక ఎకరాకు నీళ్లు పారించాలంటే ఒక గంట చాలు. మూడెకరాల్లో వ్యవసాయం చేసే రైతుకు మూడు గంటల పాటు విద్యుత్ అందుబాటులో ఉంటే చాలు. టోటల్‌గా 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్లకు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అనే స్లోగన్ తీసుకొచ్చిండు. ఉచిత కరెంట్ పేరుతో కేసీఆర్ ప్రజలను మభ్య పెడుతుండు. ఇట్లాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించొద్దు. దాన్ని మన స్వార్థానికి వాడుకోవద్దని చెప్పేసి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా చెబుతున్నం’
= రేవంత్  రెడ్డి, టీపీసీసీ చీఫ్​

ఉచిత విద్యుత్ స్టార్ట్ చేసేందే మేం

‘రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ.. వైఎస్సార్ అధికారం చేపట్టిన తర్వాత తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైలుమీదే చేశారు. అప్పుడు కేసీఆర్, చంద్రబాబు వ్యతరేకించారు. రేవంత్ అక్కడ విధానపరమైన నిర్ణయం ప్రకటించలే.. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై మాట్లాడారు. రైతులను తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుండు.’
మల్లు రవి, టీ పీసీసీ ఉపాధ్యక్షుడు  

బీఆర్ఎస్ కు కాంగ్రెసంటే భయం

కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ కు భయం పట్టుకుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికాలో చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించారు. మంత్రులంతా ఊర కుక్కల్లా మాట్లాడుతున్నరు. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై బీఆర్ఎస్ బహిరంగ చర్చకు సిద్ధమా..? సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారా..? రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడమే కాంగ్రెస్ ఎజెండా.. రుణమాఫీ చేయని కేసీఆర్ కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు.’
= పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

రేవంత్ అలా అని ఉంటే తప్పే

‘ రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో ఆ మాట అన్నారో నాకు తెలియదు. నిజంగా రేవంత్ ఉచిత విద్యుత్ అలాంటి వ్యాఖ్యలే చేసి ఉంటే తప్పే.. ఉచిత కరెంటు కోసం ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు..  రాబోయే రోజుల్లో 24 గంటల పాటు కరెంటు ఉచితంగా అందిస్తం.. ఈ విషయాన్ని మ్యానిఫెస్టోలో కూడా పెడుతాం.. 
= కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఎంపీ, భువనగిరి

రైతుల శత్రువు కాంగ్రెస్

‘ చంద్రబాబు వెళ్లిపోయినా ఆ నీడలు ఇక్కడే తిరుగుతున్నాయి.. తెలంగాణ ప్రజలకు శాశ్వత విముక్తి లభించిందనుకుంటున్న సమయంలో రేవంత్ రూపంలో మళ్లీ వచ్చాడు. మేం  రైతులకు ఉచితంగా  9 గంటల పాటు కరెంటు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ నాడు మోసం చసింది. అందుకే రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేశారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తే కాంగ్రెస్ నాయకులకు ఎందుకంత ఏడుపు.. రేవంత్ వ్యాఖ్యలపై రైతులు ఆలోచించాలె. 
= జగదీశ్​ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి

గాంధీభవన్ లో దూరిన గాడ్సే

మూడు గంటల కరెంట్ ఇస్తామని దమ్ముంటే మీ మ్యానిఫెస్ట్ లో పెట్టండి. అలా చేస్తే రైతులు గ్రామాల్లోకి కూడా రానివ్వర. మీరు ఎన్ని చెప్పినా రైతులకు కచ్చితంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం. గాంధీ భవన్ లో దూరిన గాడ్సే రేవంత్ రెడ్డి.  కమిషన్ల కోసం 24 గంటల కరెంట్ ఇస్తున్నారని రేవంత్ చెప్పడం దారుణం.
= పువ్వాడ అజయ్ కుమార్, రవాణాశాఖ మంత్రి

అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త వివాదానికి తెరలేపాయి. రేవంత్ రెడ్డి ఉచితకరెంటుపై మాట్లాడింది వేరైతే ప్రచారంలో ఉన్నది మరోటి కావడం గమనార్హం. ఆయన కేవలం మూడు గంటలపాటు ఉచిత కరెంటు ఇస్తే సరిపోతుందని చెప్పారని, కాంగ్రెస్ కు ఓటేస్తే ఉచిత విద్యుత్ కు మంగళం పాడుతుందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు వెలిశాయి. రేవంత్ వ్యాఖ్యలపై అధికార బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఊరూరా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోట్ విడుదల చేయడం గమనార్హం. రెండు రోజుల పాటు ఆందోళనలు నిర్వహించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.  దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. మంత్రులు మైకులు అందుకున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అంటూ విమర్శలు సంధించారు. దీనిపై కాంగ్రెస్ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. రేవంత్ మాట్లాడింది.. వేరని , ప్రచారం జరుగుతున్నది మరోటని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.