- ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కొన్ని చోట్ల పనులు షురూ
- మరికొన్ని చోట్ల త్వరలో ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు బస్సు స్టేషన్ల ఆధునీకరణ, విస్తరణ, పునర్నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్ల అభివృద్ధి పనులు స్పీటప్ అయ్యాయి. కొన్ని చోట్ల టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మరికొన్ని చోట్ల డిజైన్ తయారీ దశలో ఉండగా, ఇంకొన్ని ప్రాంతాల్లో పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తుండటంతో బస్సు స్టేషన్లు, డిపోల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ క్రమంలోననే అందుబాటులో ఉన్న బస్సు స్టేషన్లను ఆధునీకరించి, వాటిలో మెరుగైన వసతులు కల్పించాలని నిర్ణయించారు. వీటితో పాటు వినియోగంలో లేనివాటిని కూడా ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రయాణీల రద్దీ, ఆదాయ మార్గాలను దృష్టిలో పెట్టుకొని కొత్త బస్సు స్టేషన్ల నిర్మాణంపై యాజమాన్యం చర్యలు చేపట్టింది. కొన్ని చోట్ల బస్సు డిపోలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
కొత్త బస్సు స్టేషన్లు ఇక్కడే..
కాళేశ్వరం, మంథని, మధిర, ములుగు, కోదాడ, హుజుర్ నగర్ లలో బస్సు స్టేషన్లను నిర్మించనున్నారు. ఇందులో కాళేశ్వరం మినహా మిగితా బస్సు స్టేషన్ల పనులు కొనసాగుతున్నాయి. పాల్వంచ, మునుగోడు, కథలాపూర్, వేములవాడ, గంగాధర, ఘన్‌పూర్, గోదావరి ఖని, మర్రి గూడ, గూడూరు బస్సు స్టేషన్ల విస్తరణ, పునర్నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మహబూబ్ నగర్, నిజామాబాద్ లోని బస్సు స్టేషన్లను ఆధునీకరించనున్నారు. నర్సంపేట, నెక్కొండ బస్సు స్టేషన్లను విస్తరించి షాపింగ్ కాంప్లెక్స్ లను నిర్మించనున్నారు.
నాగర్ కర్నూల్, మాడ్గుల్, రేగొండలో బస్సు స్టేషన్ల నిర్మాణం ప్రారంభం కానుంది. ఇక పెద్దపెల్లి, అశ్వారావుపేటలో బస్ డిపోలను నిర్మించనున్నారు. 2047 విజన్ తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థను 28 శాతం నుంచి 70 శాతానికి పెంచాలనే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంలో భాగంగానే ఇప్పుడు ఇటు బస్సు స్టేషన్లు, అటు డిపోలు ఆధునీకరణ, కొత్తగా నిర్మాణం వంటి పనులతో రాష్ట్ర ప్రజలకు ఆర్టీసీ మరింత చేరువయ్యే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.

