ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సడలింపుపై ఉత్తర్వులు జారీ

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సడలింపుపై ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు సడలింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారుడు తన ఇంటిని 400 ఎస్ఎఫ్ టీ నుంచి 600 ఎస్ఎఫ్ టీ విస్తీర్ణంలో కట్టాలని గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 600 దాటినా...400కి తక్కువ ఉన్న అంగీకరించమని, యాప్ కూడా తీసుకోదని స్పష్టం చేసింది. అయితే, 400 ఎస్ఎఫ్​టీ విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం సాధ్యం కాకపోతే జీ ప్లస్ వన్ తరహాలో ఇంటి నిర్మాణం చేసుకునేందుకు తాజాగా ప్రభుత్వం అనుమతిచ్చింది.

 ఈ అంశంపై జిల్లా కలెక్టర్లకు హౌసింగ్ సెక్రటరీ, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, జీ ప్లస్ వన్ ఇళ్లు నిర్మించాలంటే కనీసం 30 గజాల స్థలంలో 323 ఎస్ఎఫ్ టీకి తక్కువ ఉండొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  ప్రభుత్వం ఇచ్చే రూ. 5 లక్షల సాయంలోనే జీ ప్లస్ వన్ ఇంటి నిర్మాణం చేయాలని స్పష్టం చేశారు. సిద్దిపేట, వనపర్తితో పాటు పలు జిల్లాల నుంచి హౌసింగ్ అధికారులకు వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.