
వర్షాలు, వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. చనిపోయిన పశువుల యజమానులకు రూ. 50 వేలు, మేకలు గొర్రెలు చనిపోతే రూ. 5 వేల చొప్పున పరిహారం ఇవ్వనుంది. ఈ మేరకు తక్షణమే పరిహారం విడుదల చేయాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన జిల్లాల కలెక్టర్లకు తక్షణ ఉపశమనం కింద రూ. 10 కోట్లు, సాధారణ నష్టం వాటిల్లిన జిల్లాల కలెక్టర్లకు రూ. 5 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాలపై సమగ్ర వివరాలతో రెండు రోజుల్లో రిపోర్టు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బృందం సెప్టెంబర్ 4వ తేదీన ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులకు అందజేస్తుందన్నారు. గతేడాది కేంద్రం నుంచి అందాల్సిన నిధులు, ప్రస్తుత నష్టం అంచనాలపై నివేదికలు రూపొందించాలని ఆదేశించారు.
82 మండలాల్లో పంట నష్టం
ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలోని 82 మండలాల్లో 2.36 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. రెండు రోజుల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పిస్తే కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని సీఎం తెలిపారు. నీట మునిగిన సబ్ స్టేషన్ల స్థానంలో కొత్త సామగ్రి, సామ ర్థ్యంతో కూడిన సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయా లని విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌కు సీఎం ఆదేశించారు. పురపాలక, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాల నిర్వహణ, ఏర్పాటుపై సమీక్ష నిర్వ హించి పరిష్కారంతో రావాలని సీఎస్ రామ కృష్ణారావుకు సీఎం సూచించారు. చెంగిచర్ల తో పాటు జియాగుడ, అంబర్ పేటలోని స్లాటర్ హౌస్‌ల్లో హలాల్, జట్కా సక్రమంగా జరిగేలా చూడాలని.. అధునాతన యంత్రాలు వాడేలా చూడాలని.. అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండాలని, మాంసం విక్రేతలు అన్ని నిబంధనలు పాటించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా,పశు సంవర్ధక శాఖలు సమగ్ర నివేదికలు రూపొందించి రెండు రోజుల్లో అందజేయాలని సీఎం ఆదేశించారు.