జహీరాబాద్లో హస్తం హవా.. ఇంద్రేశంలో పట్టునిలుపుకున్న బీఆర్ఎస్

జహీరాబాద్లో హస్తం హవా.. ఇంద్రేశంలో పట్టునిలుపుకున్న బీఆర్ఎస్
  • సంగారెడ్డి జిల్లాలో మొత్తం 11 బల్దియాల్లో 
  • 6 చోట్ల కాంగ్రెస్, 5 బీఆర్ఎస్​ సొంతం

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, ఇంద్రేశం బల్దియాల్లో ఎట్టకేలకు మంగళవారం పాలకవర్గాలు కొలువుదీరాయి. జహీరాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఇంద్రేశం బల్దియాను బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11 మునిసిపాలిటీలు ఉండగా సోమవారం 9 మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు కొలువుదీరాయి. కోరం లేని కారణంగా జహీరాబాద్, ఇంద్రేశం బల్దియాల్లో 

చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. మంగళవారం ఆ రెండు మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు ఏర్పడ్డాయి. దీంతో 11 బల్దియాల్లో కాంగ్రెస్ 6 ఆరు చోట్ల, బీఆర్ఎస్ 5 స్థానాల్లో ఆధిపత్యాన్ని చాటి ఆయా మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయి. 

జహీరాబాద్ లో కాంగ్రెస్

జహీరాబాద్  మున్సిపల్  చైర్ పర్సన్ గా 5వ వార్డు కౌన్సిలర్ మొహమ్మద్ యునూస్, వైస్ చైర్ పర్సన్ గా 16వ వార్డు కౌన్సిలర్ కొత్త కాపు శిరీష ఎన్నికయ్యారు. ఇద్దరితో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అధికారుల ఏకపక్ష నిర్ణయం వల్ల కాంగ్రెస్ దొడ్డిదారిన చైర్​పర్సన్, వైస్ చైర్​పర్సన్ స్థానాలను కైవసం చేసుకుందని ఎన్నిక అనంతరం బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. ఆల్ఫాబెటికల్ ఆధారంగా పిలవకుండా ముందుగా కాంగ్రెస్ వారిని పిలిచి అన్యాయం చేశారన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని బీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్, ఎన్నికల ఇన్​చార్జి జైత్రం స్పందిస్తూ ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా చైర్​పర్సన్, వైస్ చైర్​పర్సన్​ల ఎంపిక జరిగిందన్నారు. కోరం పూర్తిగా ఉండడం వల్ల ఎన్నిక పూర్తి చేశామన్నారు.

ఇంద్రేశంలో బీఆర్ఎస్

ఇంద్రేశం బల్దియా చైర్ పర్సన్ గా బీఆర్ఎస్ నుంచి కుశంగుల ప్రమీల ఎన్నిక కాగా వైస్ చైర్​ పర్సన్​ గా పట్లోళ్ల హరీశ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇక్కడ 18 వార్డులు ఉండగా బీఆర్ఎస్ కు 9, కాంగ్రెస్ 6, బీజేపీకి 2, ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. స్వతంత్ర కౌన్సిలర్ బీఆర్ఎస్ లో చేరడంతో బీఆర్ఎస్ బలం 10కి చేరింది. సోమవారం జరగాల్సిన చైర్ పర్సన్ ఎన్నిక కోరం లేక వాయిదా పడడంతో కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు. మంగళవారం బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు ఇద్దరు బీజేపీ, ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతుతో చైర్ పర్సన్ గా ప్రమీల, వైస్ చైర్​పర్సన్​ గా హరీశ్ రెడ్డి ఎన్నిక కాగా అధికారులు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.