
- సభ్యులుగా పలువురు దర్శకులు, నిర్మాతలు, జర్నలిస్ట్‌కు చోటు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కమిటీని నియమించింది. సీనియర్ యాక్టర్, నిర్మాత మురళీ మోహన్ చైర్మన్ గా స్పెషల్ అవార్డ్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ సమాచార శాఖ స్పెషల్ సెక్రటరీ వినయ్ కృష్ణారెడ్డి గురువారం జీవో జారీ చేశారు. ఈ కమిటీలో దర్శకులు కే.దశరథ్, కూచిపూడి వెంకట్, నిర్మాతలు డీవీకే రాజు, కే.శ్రీధర్ రెడ్డి, ప్రముఖ కూచిపూడి నాట్య గురువు డాక్టర్ వనజా ఉదయ్, నటి ఊహ, సీనియర్ జర్నలిస్ట్ కే.ఉమామహేశ్వర రావు ఉన్నారు. పదేండ్లుగా నంది అవార్డ్స్ ఇవ్వనందున.. ఒక్కో ఏడాదికి ఒక ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ను ఈ అవార్డ్స్ కమిటీ ఎంపిక చేయనున్నది.
అలాగే, ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య, పైడి జయరాజ్, ప్రభాకర్ రెడ్డి తదితరుల పేరిట ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలకు మురళీ మోహన్ కమిటీ ఎంపిక చేయనున్నది.ఒకవైపు జయసుధ అధ్యక్షతన ఏర్పడిన జ్యూరి కమిటీ సభ్యులు.. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఎంపిక కోసం వరసగా సినిమాలు చూస్తున్నారు. ఈ నెల చివరి వరకు ఈ పక్రియ పూర్తి కానున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని చూడకుండా గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ను పారదర్శకంగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నది. వచ్చే నెల 4న హైటెక్స్ లో గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్నది.