
ఎన్ఎస్ యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్
కరోనా మరణాలపై ఆధారాలు ట్విట్టర్ లో పోస్టు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా మరణాలపై ఎన్ఎస్ యూఐ మరిన్ని ఆధారాలను బయట పెట్టింది. జిల్లాలో కరోనా సోకి మరణించిన వారి వివరాలను ఎన్ ఎస్ యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. యాదాద్రి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో హాస్పిటల్లో చేరితే, డెత్ రిపోర్టులో మాత్రం కార్డియాక్ అరెస్ట్ గా పేర్కొన్నారని ఆరోపించారు. ఇదే తీరుగా నారాయణగూడకు చెందిన మరో వ్యక్తి పాజిటివ్ అని తేలినప్పటికీ, శ్వాస ఇబ్బందితో చనిపోయాడంటూ రిపోర్టులో ఉందన్నారు.
ప్రైవేటు, సర్కార్ హాస్పిటళ్లలో కరోనాతో మరణాలు సంభవిస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగమే తెలియనట్లుగా మరణాలను రహస్యంగా ఉంచుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినదని, మహమ్మారి కట్టడిపై నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు మరణాలపై స్పందించడం లేదని ఆరోపించారు. కాజ్ ఆఫ్ డెత్ తో ప్రభుత్వం కరోనా మరణాలను మాయ చేస్తుందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.