ఏజ్​ లిమిట్​ పెంచుతలే.. నోటిఫికేషన్లు ఇస్తలే

ఏజ్​ లిమిట్​ పెంచుతలే.. నోటిఫికేషన్లు ఇస్తలే
  • నిరుద్యోగి ఏజ్​బార్​
  • 3 లక్షల మందికి ఏజ్​ లిమిట్​ దాటిపోయింది
  • రెండేండ్ల కిందట్నే ముగిసిన వయోపరిమితి పెంపు జీవో గడువు
  • 50 వేల కొలువులు భర్తీ చేస్తామని ఎనిమిది నెలలుగా ఊరిస్తున్న సీఎం

హైదరాబాద్​, వెలుగు: త్వరలోనే 50 వేల జాబ్స్​ను భర్తీ చేస్తామని ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వ పెద్దలు ఊరిస్తున్నారు తప్ప నోటిఫికేషన్లు ఇస్తలేరు. ఉద్యోగ ఖాళీల గుర్తింపు కోసం మంత్రి హరీశ్​రావు​ నేతృత్వంలో ఐదురోజుల్లోనే లెక్క తేల్చాలని గత నెల 14, 15న జరిగిన కేబినెట్​ భేటీలో చెప్పినా.. దానికీ అతీగతి లేదు. ఉద్యోగ అర్హత వయసు పెంపుపైనా ఎలాంటి ప్రకటన చేస్తలేరు. ఇట్ల నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర సర్కారు ఆటలాడుకుంటోంది. ఏండ్లకేండ్లుగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ పుస్తకాలతో కుస్తీ పడుతున్న తమకు ఏజ్​ బార్​ అవుతోందని నిరుద్యోగులు అంటున్నారు. వయోపరిమితి పెంపుపై క్లారిటీ లేకపోవడంతో తాము ప్రిపేర్​ కావాల్నో వద్దో కూడా అర్థమవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2019 జులైలోనే ముగిసింది
డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​లో ఉద్యోగాల భర్తీకి వయోపరిమితి 34 ఏండ్లుగా ఉంది. కొట్లాడిందే కొలువుల కోసమని, జాబ్ నోటిఫికేషన్లలో ఏజ్​ లిమిట్​ను  పెంచాలని రాష్ట్రం వచ్చిన కొత్తలో విద్యార్థి ఉద్యమకారులు డిమాండ్ చేయడంతో పదేండ్ల సడలింపు ఇస్తూ (34 ఏండ్ల నుంచి 44 ఏండ్లకు పెంచుతూ)  2015 ఆగస్టులో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఒక్క ఏడాది మాత్రమే ఈ సడలింపు వర్తిస్తుందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎప్పటిలాగే ప్రత్యేక సడలింపులు అమలవుతాయని జీవోలో పేర్కొంది.  అయితే ఆ ఏడాది పెద్దగా జాబ్ నోటిఫికేషన్లు రాకపోవడంతో మరో ఏడాది ‘పదేండ్ల సడలింపు’ను పొడిగించింది. ఆ తర్వాత కూడా నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగుల నుంచి వచ్చిన డిమాండ్​ మేరకు మరో రెండేండ్లు పొడిగించింది. ఈ జీవో వ్యాలిడిటీ 2‌019 జులై  26తో ముగిసింది. అయితే 50 వేల పోస్టులు భర్తీ చేస్తామని గత ఏడాది డిసెంబర్​ 13న సీఎం కేసీఆరే స్వయంగా ప్రకటించడం, ఇటీవల 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ లో వయో పరిమితి సడలింపు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లూ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడాల్సి వచ్చిందని, ఇప్పుడు  కూడా ఏదో అరకొరగా నోటిఫికేషన్ల గురించి చెప్తున్నా.. ఏజ్ లిమిట్  పెంపుపై ఎందుకు మాట్లాడటం లేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఏజ్​లిమిట్​ను మరో పదేండ్లు పెంచాలన్న డిమాండ్ చేస్తున్నారు. 

ఆఫీసర్లు ప్రపోజల్స్​ రెడీ చేసినా..!
వెకెంట్​ పోస్టులపై, ఏజ్​ లిమిట్​ పెంపు గురించి పైనుంచి ఎటువంటి ఆదేశాలు ఇస్తలేరని ఆఫీసర్లు అంటున్నారు. ఖాళీలపై క్లియర్​గా రెండుసార్లు వివరాలు అందజేశామని, అయినా ఎలాంటి స్పందన లేదని పేర్కొంటున్నారు. గడువు ముగిసిన వెంటనే  ఏజ్ లిమిట్​పెంచేందుకు రెండేండ్ల కిందటే ప్రపోజల్స్​ రెడీ చేసి పెట్టుకున్నామని, ఎంత పెంచాలి ? ఎలా అమలు చేయాలనే దానిపై సర్కార్​ నుంచి ఆదేశాలు లేవని అధికారులు అంటున్నారు. త్వరలో భర్తీ చేస్తామని చెప్తున్న యాభై వేల ఉద్యోగాలకు ఏజ్​ లిమిట్​ పెంపు వర్తిస్తుందో లేదో తమకు తెలియదని వారు చెప్తున్నారు. 

పీఆర్సీ ప్రకారమే.. 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా..!
రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ తన రిపోర్ట్​లో పేర్కొంది. ఈ లెక్కన ప్రతి డిపార్ట్​మెంట్​లోనూ వేల సంఖ్యలో వేకెంట్​ పోస్టులుంటాయని, ఏజ్​లిమిట్​ పెంచి వాటన్నింటిని భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్​ చేస్తున్నారు. అయితే.. సర్కారు మాత్రం 50వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని ఊరించుడు తప్పిస్తే వాటి కోసం ఎప్పుడు నోటిఫికేషన్​ ఇస్తుందో తెలియడం లేదు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గ్రూప్​ వన్​ నోటిఫికేషన్  రాలేదు. 2015లో ఇచ్చిన గ్రూప్​ 2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఐదేండ్లకు కానీ పూర్తి చేయలేదు. ఖాళీలు కనిపిస్తున్నా మళ్లీ గ్రూప్​ 2  నోటిఫికేషన్ ఇస్తలేరు. 

నిరుద్యోగులు 33 లక్షల మంది
టీఎస్​పీఎస్సీ  వెబ్​ పోర్టల్​లో దాదాపు 26 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్​ చేసుకున్నారు. అందులో రిజిస్టర్ చేసుకోకుండా ఉన్న నిరుద్యోగులు మరో 7 లక్షల మంది దాకా ఉంటారు. మొత్తంగా రాష్ట్రంలో 33 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని నిరుద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఇందులో దాదాపు మూడు లక్షల మంది 34 ఏండ్లు(ఉద్యోగ అర్హత వయసు) దాటినోళ్లు ఉంటారని అంచనా. ఇన్నాళ్లూ నోటిఫికేషన్లు సరిగ్గా లేవని, ఇప్పుడు వేస్తామని చెప్తున్న నోటిఫికేషన్లలోనైనా ఏజ్​ లిమిట్​ను పెంచుతారా లేదా అని వీళ్లు ఆందోళన చెందుతున్నారు.

ఖాళీల లెక్కలు ఇచ్చినా..!
త్వరలోనే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వం చెప్పుడం, ఈ అంశాన్ని ఎన్నికల్లో టీఆర్​ఎస్​ లీడర్లు ప్రచారానికి ఉపయోగించుకోవడం తప్పిస్తే ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. గత నెల మొదటి వారంలోనే ఉద్యోగ ఖాళీలను సిద్ధం చేసి  కేబినెట్​కు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జులై 13, 14 తేదీల్లో జరిగిన కేబినెట్​ సమావేశాల్లో ఖాళీల వివరాలను అధికారులు అందజేశారు. అయితే వాటిని పక్కన పెట్టిన సీఎం.. మళ్లీ ఐదు రోజుల్లో వెకెంట్​ పోస్టుల వివరాలు ఇవ్వాలన్నారు. ఈ మేరకు ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ ఒక రిపోర్ట్​ను కూడా తయారు చేసి ఈ నెల ఒకటో తేదీన జరిగిన కేబినెట్​ భేటీలో సమర్పించింది. అయితే దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ప్రక్రియను సర్కార్​ మళ్లీ వాయిదా వేసేందుకు ప్రయత్ని స్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఏండ్లుగా ప్రిపరేషన్  కొనసాగిస్తున్నా నోటిఫికేషన్లు రాక.. ఏజ్​ పెరిగిపోతుండటంతో.. మనస్తాపంతో ఇటీవల కొందరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. 

గ్రూప్స్​కు ఐదేండ్లుగా ప్రిపేర్​ అవుతున్న
ఐదేండ్లుగా గ్రూప్ 1, 2, జేఎల్, డీఎల్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న. నోటిఫికేషన్లు రావడం లేదు. నా ఏజ్​లిమిట్ కూడా దాటిపోయింది. ఇప్పుడు నాకు నలభయ్యేండ్లు. రెండేండ్ల కిందనే ఏజ్ పెంపు జీవో గడువు ముగిసింది. ప్రభుత్వం వెంటనే ఏజ్​ లిమిట్ పెంచాలి. ఎంప్లాయీస్​ రిటైర్మెంట్ ఏజ్​ను  పెంచిన సర్కారు.. రిక్రూట్​మెంట్​కు ఏజ్ ఎందుకు పెంచదు..?
‑ జె.శంకర్, నిరుద్యోగి 

ఏజ్​ లిమిట్​ను మరో పదేండ్లు పెంచాలి
విద్యార్థి, నిరుద్యోగుల పోరాటంతో వచ్చిన తెలంగాణలో నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. వెంటనే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు ఏజ్​ లిమిట్​ పెంచాలి. ఇంకెంత కాలం నాన్చుడు ధోరణి అవలంబిస్తరు?  హుజూరాబాద్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ధ్యాస తప్ప.. విద్యార్థి, నిరుద్యోగుల కష్టాలు కేసీఆర్ కు పట్టడం లేదు. రెండేండ్ల నుంచి ఏజ్​ లిమిట్​ పెంచకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో మునుగుతున్నరు. యాభై వేల ఉద్యోగాలే కాకుండా ఎన్ని ఖాళీలు ఉంటే అన్నింటికి  నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయాలి. మరో పదేండ్లు  ఏజ్​ లిమిట్​ పెంచాలి.   
 - తిరుపతి యాదవ్, కేయూ జాక్ చైర్మన్