
- డిప్యూటీ సీఎం భట్టి, అధికారుల కమిటీ హామీ ఇచ్చింది
- ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టొద్దన్న జేఏసీ చైర్మన్
హైదరాబాద్, వెలుగు: ఆర్థిక భారం లేని సమస్యలు పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి, అధికారుల కమిటీ హామీ ఇచ్చిందని ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఇందుకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టికి జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. నాంపల్లిలోని టీఎన్జీవోస్ భవన్లో మంగళవారం 206 సంఘాల జేఏసీ మీటింగ్ జరిగింది. అనంతరం జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఉద్యోగ సంఘాలకు చెందిన కొందరు మాజీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాయి.
57 సమస్యలు గత ప్రభుత్వం నుంచి ఉన్నవే. సమస్యలపై మాట్లాడుతున్న నేతలు గత ప్రభుత్వంలో ఎందుకు పరిష్కరించలేదు? ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ప్రతి నెలా రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్లు ఇస్తామన్నారు. ఇలా 4 నెలలు ఇస్తే అన్ని క్లియర్ అవుతాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా ఉద్యోగులు 2 పీఆర్సీలు నష్టపోయారు. కొన్ని శాఖల్లో జీతాలు లేట్ అవుతున్నాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించొద్దు. పెండింగ్ లో 5 డీఏలు, హెల్త్ స్కీమ్, 317 జీవో అంశం, ఎలాంటి కండీషన్లు లేకుండా వీఆర్వోలను విధుల్లోకి తీసుకోవాలని అధికారుల కమిటీ దృష్టికి తీసుకెళ్లాం’’అని జగదీశ్వర్ అన్నారు.
మళ్లీ అధికారుల కమిటీని కలుస్తాం: శ్రీనివాస రావు
ఉద్యోగుల సమస్యల్లో 12 మాత్రమే నిధులకు సంబంధించినవి ఉన్నాయని, మిగిలినవి సమావేశం ఏర్పాటు చేసుకుని పరిష్కరించుకోవచ్చని ఉద్యోగుల జేఏసీ జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాస రావు అన్నారు. మరోసారి అధికారుల కమిటీని కలుస్తామని తెలిపారు. నిధులు కొరత కారణంగా కొంత టైమ్ కావాలని ప్రభుత్వం అడిగిందన్నారు. అందుకే 15న జిల్లాల్లో చేపట్టాల్సిన ధర్నాలు వాయిదా వేశాం. వచ్చే నెల 9న మహాధర్నా వరకు వేచి చూస్తాం’’అని శ్రీనివాస రావు అన్నారు.