మూడు రోజులు నుమాయిష్ పొడిగింపు

మూడు రోజులు నుమాయిష్ పొడిగింపు

బషీర్ బాగ్ , వెలుగు : నుమాయిష్ మరో మూడు పొడిగిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి , ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు డి. శ్రీధర్ బాబు తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం నుమాయిష్ లో ఏర్పాటైన ఉత్తమ స్టాళ్లు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులకు మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ బి.హనుమంతరావు , ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్ లు సన్మానించి అవార్డులను అందజేశారు.

అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ నుమాయిష్ కు 83 ఏళ్ల చరిత్ర ఉందని, వివిధ రాష్ట్రాలకు చెందిన పారిశ్రామిక వ్యాపారులు, నిరుద్యోగులు ప్రత్యక్షంగా, పరోక్షంగా 46 రోజుల పాటు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. అనంతరం మంత్రి కృష్ణారావు మాట్లాడుతూ.. నుమాయిష్ లో 2,400 పైగా స్టాళ్లు ఏర్పాటు చేసి, వివిధ రకాల ఉత్పత్తులను విక్రయించడం,  లక్షలాది మంది సందర్శించడం గొప్ప విషయం అన్నారు. ఇన్నిరోజులు పని చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ శాఖల అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి రాజేందర్ కుమార్, జాయింట్ సెక్రటరీ చంద్రజిత్ సింగ్ పాల్గొన్నారు.