- హెచ్ఎంలు, సీనియర్ ఎస్ఏలతో నింపాలని సర్కారు నిర్ణయం
- కలెక్టర్లకు లేఖ రాసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
హైదరాబాద్, వెలుగు: సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ల పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం తాత్కాలికంగా ఆసక్తిఉన్న గెజిటెడ్ హెడ్మాస్టర్లు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్ల సేవలను వినియోగించుకోవాలని డిసైడ్ అయింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్.. కలెక్టర్లకు తాజాగా లేఖ రాశారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో అర్హులైన వారిని ఫారిన్ సర్వీస్ లేదా ఓడీ ప్రాతిపదికన తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా ప్రాజెక్టు ఆఫీసుల్లో (డీఈఓ) ప్లానింగ్ అండ్ ఎంఐఎస్, ఐసీటీ కోఆర్డినేటర్, క్వాలిటీ అండ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్, జెండర్ అండ్ ఈక్విటీ కోఆర్డినేటర్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ సీఎంఓ కోఆర్డినేటర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 165 పోస్టులకు ప్రస్తుతం 109 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వివిధ కారణాలతో కొందరు తిరిగి స్కూళ్లకు పోవడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. 2023లో టెస్ట్ పెట్టి వారందరినీ తీసుకున్నారు. అయితే, ప్రస్తుతం ఆ మెరిట్ లిస్టులో చాలా మంది అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు కొమురంభీం ఆసిఫాబాద్‌లో అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ పనుల అమలులో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో సమగ్ర శిక్ష, పీఎంశ్రీ కార్యక్రమాలను అమలు చేసేందుకు కోఆర్డినేటర్ల పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరీంనగర్, సిద్దిపేట, వనపర్తి, వికారాబాద్, వరంగల్ రూరల్, యాద్రాద్రి భువనగిరి జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో వేకెన్సీలు ఉన్నాయి.
