
- చైర్మన్‌గా నవీన్ మిట్టల్, మెంబర్లుగా లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్
- ఉద్యోగ సంఘాలతో చర్చించి వారంలోగా రిపోర్టు ఇవ్వాలని సర్కార్ ఆదేశం
- నేడు ఉద్యోగ సంఘాలతో కమిటీ తొలి మీటింగ్
- కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వానికి ఉద్యోగుల జేఏసీ కృతజ్ఞతలు
హైదరాబాద్, వెలుగు:ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వాళ్ల సమస్యలపై చర్చించి, రిపోర్ట్ ఇచ్చేందుకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్‌గా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, మెంబర్లుగా పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేశ్ కుమార్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్‌ను నియమించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు మంగళవారం జీవో నెంబర్ 572 జారీ చేశారు.
ఉద్యోగుల సమస్యలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో చర్చించి, వారంలోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి వాళ్ల అభిప్రాయాలు తెలుసుకోవాలని, సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించాలని కోరారు.
ఇయ్యాల్నే ఫస్ట్ మీటింగ్..: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ బుధవారం సెక్రటేరియెట్‌లో ఉద్యోగ సంఘాలతో తొలి మీటింగ్ నిర్వహించనుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు చర్చలకు రావాలని తమను ఆహ్వానించారని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, టీజీఈజేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు.
ఉద్యోగుల జేఏసీ నుంచి చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్జీవో, టీజీవో జనరల్సెక్రటరీలు ముజీబ్, సత్యనారాయణ, నేతలు వంగ రవీందర్ రెడ్డి, చావా రవితో పాటు మొత్తం 14 మంది హాజరుకానున్నారు. తమ సమస్యలపై చర్చించడానికి కమిటీ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యోగుల జేఏసీ, టీజీఈజేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం సెక్రటేరియెట్‌లో నవీన్ మిట్టల్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పారు.
ఇది శుభపరిణామం: లచ్చిరెడ్డి
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని, ఇది శుభపరిణామమని టీజీఈజేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించడం హర్షణీయమన్నారు. నాంపల్లిలోని సీసీఎల్ఏ ఆఫీసులో మంగళవారం యూనియన్ మీటింగ్నిర్వహించారు. ఇందులో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, ఉద్యోగుల హక్కులపై డిపార్ట్‌మెంట్ల వారీగా చర్చించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరలోనే పరిష్కరించుకోవాలని తీర్మానం చేశారు.
ముందు ఆర్థిక భారం లేనివి..
సెక్రటేరియెట్‌లో బుధవారం నిర్వహించనున్న తొలి సమావేశంలో ఉద్యోగులు తమ 57 సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. పీఆర్సీ, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు, సీపీఎస్ రద్దు, పెండింగ్ మెడికల్ బిల్స్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, ఈహెచ్ఎస్ అమలు, అదనపు పోస్టులు సృష్టించి 317 జీవో బాధితులకు న్యాయం చేయడం, ఏకీకృత సర్వీస్ రూల్స్, హెచ్‌వోడీల నుంచి సెక్రటేరియెట్‌కు బదిలీలో 12.5 శాతం కోటా అమలు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, కారుణ్య నియామకాలు, ఉద్యోగుల సాధారణ బదిలీలు, ఎంపీ ఎన్నికల టైమ్‌లో బదిలీ చేసిన ఉద్యోగులను తిరిగి వారి పాత స్థానాల్లోకి ట్రాన్స్ఫర్చేయడం, గ్రామ పంచాయతీలను గ్రేడ్ల వారీగా విభజించడం వంటి 57 సమస్యలు ఉన్నాయి.
అయితే ఇందులో 50 సమస్యలు పరిష్కరించాలంటే ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉండదని, కేవలం అధికారులు మీటింగులు ఏర్పాటు చేసి పరిష్కరించవచ్చని, మిగతా ఏడు సమస్యలు పరిష్కరించాలంటేనే నిధులు అవసరమవుతాయని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. ఆర్థిక భారం ఉన్నవి, లేని సమస్యలను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో కచ్చితమైన సమయం చెప్పాలని కమిటీని కోరతామన్నారు.