427 మంది స్కూల్ అసిస్టెంట్లకే స్పౌజ్ బదిలీలు

427 మంది స్కూల్ అసిస్టెంట్లకే స్పౌజ్ బదిలీలు
  • 12 జిల్లాల్లో ప్రమోషన్ పోస్టుల్లో అడ్జెస్ట్మెంట్
  • మల్టీజోన్, జోన్ ఇష్యూతో 188 అప్పీల్స్​ పెండింగ్
  • బ్లాక్ చేసిన13 జిల్లాల్లో ఎస్జీటీలకు చాన్స్ లేనట్టే

హైదరాబాద్, వెలుగు: ఏడాదిగా స్పౌజ్ టీచర్లు చేస్తున్న ఆందోళనలకు కొంత ఫలితం దక్కింది. బ్లాక్ చేసిన 13 జిల్లాల్లో 615 మంది స్కూల్​ అసిస్టెంట్ల బదిలీలకు అనుమతి ఇస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 12 జిల్లాల్లోని 427 మంది స్కూల్ అసిస్టెంట్ల అప్పీళ్లను అధికారులు పరిష్కరించి పోస్టింగ్​లు ఇచ్చారు. అత్యధికంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల నుంచి బదిలీలు ఉన్నట్టు తెలిసింది. సూర్యాపేట జిల్లాలో ఎవరూ దరఖాస్తు చేయకపోవడంతో అక్కడ బదిలీలు చేయలేదు. మల్టీజోన్, జోన్ ఇష్యూతో 188 అప్పీల్స్​ పెండింగ్​లో పెట్టారు. గతేడాది డిసెంబర్​లో 317 జీవో ద్వారా జిల్లాలు అలాట్ కాగా, 13 జిల్లాల్లో మాత్రం డైరెక్ట్​ రిక్రూట్మెంట్ పోస్టులకు ఇబ్బంది అవుతుందనే కారణంతో స్పౌజ్ బదిలీలు చేయలేదు. ఏడాది కాలంగా వారంతా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తూవస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్ట్​ రిక్రూట్మెంట్​ కు ఇబ్బంది లేకుండా 12 జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పోస్టుల్లో స్పౌజ్ టీచర్లను ఇప్పుడు అడ్జెస్ట్ చేశారు. దీంతో ఆయా జిల్లాల్లో కొత్తగా చేరిన పలు సబ్జెక్టుల టీచర్లకు ప్రమోషన్లు పొందే అవకాశం లేకుండా పోయింది. 

సర్కార్​ క్లారిటీ వచ్చిన తర్వాతే..

మల్టీజోన్, జోన్ ఇష్యూతో 188 అప్పీల్స్​ పెండింగ్​లో పెట్టారు. ప్రస్తుతం స్పౌజ్ దరఖాస్తు పెట్టుకున్నవారిలో భర్త లేదా భార్య మల్టీజోన్/జోన్ పరిధిలో పనిచేస్తున్నారు. జోన్లలో పనిచేస్తున్న భార్య లేదా భర్త వేరే జిల్లాకు బదిలీ అయితే, స్పౌజ్ కేటగిరిలో వీరిని ట్రాన్స్​ఫర్​ చేసి ఏం ప్రయోజనం అనే దానిపై స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారును క్లారిటీ కోరారు. అక్కడి నుంచి వచ్చే స్పందనను బట్టి వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. వంద శాతం డైరెక్ట్​ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయ్యే ఎస్జీటీ స్పౌజ్ అప్పీళ్లపై సర్కారు ఏ నిర్ణయం తీసుకోలేదు. వారికి భవిష్యత్​లోనూ బదిలీ అవకాశం కల్పించే చాన్స్​ లేనట్టు తెలుస్తోంది. అయితే వారికి డిప్యుటేషన్​పై కొంతకాలం కోరుకున్న జిల్లాల్లో పనిచేసే అవకాశం ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. మరోవైపు 12 జిల్లాల్లో 70% ప్రమోషన్ వెకెన్సీల్లో స్పౌజ్ టీచర్లను నింపడంపై ఆయా జిల్లాల టీచర్ల నుంచి కొంత వ్యతిరేకత వస్తోంది. స్పెషల్ కోటా కింద వారిని తీసుకురావాలి గానీ, తమకొచ్చే ప్రమోషన్ల నుంచి ఇవ్వడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.