కొత్త కార్పొరేషన్లకు పండుగ..రూ.17,907 కోట్లతో పుర బడ్జెట్

కొత్త కార్పొరేషన్లకు పండుగ..రూ.17,907 కోట్లతో పుర బడ్జెట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖకు  ప్రభుత్వం రూ.17,907 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ.7458 కోట్లు , వివిధ స్కీముల కింద  రూ.10,450 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే ఈ సారి రూ.230 కోట్లు ఎక్కువ ఇచ్చారు. కొత్తగా ఏర్పడ్డ మంచిర్యాల, మహబూబ్​నగర్​,‘ కొత్తగూడెం– పాల్వంచ’ కార్పొరేషన్లలో అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా రూ.వెయ్యి కోట్లు కేటాయించడం విశేషం. పట్టణాభివృద్ధి శాఖ బడ్జెట్​ను పరిశీలిస్తే ప్రధానంగా కేంద్రం నిధులపై దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. ఈ సారి స్టేట్ సెక్టార్ స్కీమ్స్​కింద 6,860.31 కోట్లు, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కింద 1,813.68 కోట్లు చూపడం గమనార్హం.

జీహెచ్​ఎంసీ పరిధిలో భారీగా నిధుల ఖర్చు

ఓఆర్ఆర్ పరిధిలోని17 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్​ఎంసీలో విలీనం చేసిన తర్వాత జీహెచ్​ఎంసీ ని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్​గిరి కార్పొరేషన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. ఈ మూడు కార్పొరేషన్ల పరిధిలో మౌలిక సదుపాయాల కోసం రూ.2,654 కోట్లు, మెట్రో రైల్ ఫేజ్2 కోసం రూ.600 కోట్లు, హైదరాబాద్​ మెట్రో రైల్​ లోన్​ చెల్లింపుల కోసం రూ.500 కోట్లు, వాటర్​ సప్లై సీవరేజ్​ బోర్డు లోన్​ చెల్లింపులకు రూ.1,450 కోట్లు, మూసీ రివర్​ ఫ్రంట్​ డెవలప్​మెంట్​ కోరకు రూ.1,500 కోట్లు, సుంకిశాల ఇంటెక్​ ప్రాజెక్ట్​ కోసం రూ.1,000 కోట్లు, హెచ్​ఎండీఏ లోన్స్​ కోసం రూ.500 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.  కరీంనగర్​, వరంగల్​ అమృత్​ స్కీం కోసం స్టేట్​ వాటాగా రూ.200 కోట్లకు పైగా కేటాయించడం విశేషం.

పట్టణాభివృద్ధి శాఖ తరపున కేటాయించిన నిధులు (రూ.కోట్లలో)

అంశం                              2025         2026
బడ్జెట్ కేటాయింపులు    17,677      17,907
సీడీఎంఏ విభాగం           1,718.26    4,455.46
ఎంఏయూడీ విభాగం     4,760.55     4,193.53
స్టేట్ సెక్టార్ స్కీమ్స్​      5,044.15       6,860.31
సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ 1,026.86    1,813.68