అందర్ని పాస్ చేయడం ఇదే లాస్ట్

అందర్ని పాస్ చేయడం ఇదే లాస్ట్

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలపై తెలంగాణప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫస్టియర్ లో అందరినీ పాస్ చేస్తున్నామని ప్రకటించింది. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ మినిమమ్ పాస్ మార్కులు 35 వేస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. విద్యార్థులెవరూ తొందరపడి ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు దగ్గర్లోనే ఉన్నందును..విద్యార్థులెవరూ ఒత్తిడికి గురికావొద్దనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఇంటర్ బోర్డు, ప్రభుత్వాన్ని నిందించడం కరెక్ట్ కాదన్నారు. ఎక్కడ ఒక్క తప్పిదం కూడా జరగలేదన్నారు. పిల్లల భవిష్యత్ తో రాజకీయాలు చేయొదన్నారు. కరోనాతో విద్యార్థులు ఎంతో నష్టపోయారని.. అందుకే 70 పర్సంటేజ్ సిలబస్ తోనే ఎగ్జామ్స్ పెట్టామన్నారు. ధర్నాలు, ఆందోళనలు చేస్తే పాస్ చేస్తారనుకోవడం తప్పన్నారు. అందరినీ పాస్ చేయడం ఇదే లాస్ట్ అన్నారు. ప్రతి విద్యార్థికి ఇంటర్ టర్నింగ్ పాయింట్ అని అన్నారు .ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వాన్ని,బోర్డును నిందించడం సరికాదన్నారు. 10 వేల మంది స్టూడెంట్స్ 95 శాతం స్కోర్ చేశారన్నారు. కష్టపడి చదవాలని విద్యార్థులను కోరారు. రివాల్యూయేషన్ అప్లై చేసుకున్న విద్యార్థులు 35 మార్కులతో సంతృప్తి చెందితే వారి ఫీజును వెనక్కి ఇస్తామన్నారు. లేకపోతే రివాల్యూయేషన్ చేస్తామన్నారు.

ఇంటర్ ఫస్టియర్ లో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. దీంతో  ఏడెనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.  కొన్ని రోజులుగా అందర్నీ పాస్ చేయాలంటూ విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. విద్యార్థుల చావులకు సర్కారే కారణమంటూ ఇంటర్ బోర్డును ముట్టడించారు. సర్కారు తీరుపై విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. ఫస్టియర్ లో అందర్నీ పాస్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది.